షెడ్యూల్ ఎన్నికలకు ఇంకా రెండేళ్ళుండగానే జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా జనాల్లో పర్యటనలకు రెడీ అయిపోతున్నారు. ఈనెల 27వ తేదీన మంత్రులు, జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయ కర్తలతో భేటీ సందర్భంగా ఇదే విషయాన్ని స్పష్టం చేయబోతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిందే అని అందరికీ క్లారిటీ ఇవ్వబోతున్నారు. అందుకు తగ్గట్లే పార్టీపరంగా తీసుకోవాల్సిన చర్యలేంటి ప్రభుత్వపరంగా తాను తీసుకోబోతున్న చర్యలను వివరించేందుకే కీలక సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గడచిన మూడేళ్ళలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పథకాలను అందుకుంటున్న జనాల అభిప్రాయాలు తెలుసుకునేందుకే గడపగడపకు వైసీపీ అనే కార్యక్రమానికి సీఎం తొందరలోనే శ్రీకారం చుట్టుబోతున్నారు. మే నెలలో రచ్చబండ కార్యక్రమంతో జిల్లాల పర్యటనలు మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించారు.
రాబోయే ఎన్నికల్లో జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలపై పెద్ద బాధ్యతలనే జగన్ మోపారు. జిల్లాల్లో మంత్రులు, ఎంఎల్ఏల మధ్య సమన్వయం సాధించటం, ఎంఎల్ఏలకు, పార్టీ క్యాడర్ కు మధ్య సమన్వయం పెంచటం అనే అంశాలు కీలకంగా ఉండబోతున్నాయి. మొత్తంమీద మంత్రులైనా, ఎంఎల్ఏలు అయినా రెగ్యులర్ గా జనాలతో టచ్ లో ఉండటమే కీలకమని జగన్ చెప్పబోతున్నారు.
తొందరలోనే చంద్రబాబు నాయుడు కూడా జిల్లాల పర్యటన పెట్టుకోబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే జిల్లాల పర్యటనలో ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు ఆర్థిక సాయం పేరుతో పవన్ అనంతపురం, పశ్చిమగోదావరిలో పర్యటించారు. ప్రతిపక్షాల నేతలు ఏదో రూపంలో జనాలతో టచ్ లో ఉంటున్న కారణంగా మంత్రులు, ఎంఎల్ఏలు కూడా జనాల్లోనే ఉండే తప్పని పరిస్ధితి. ఇదే విషయాన్ని జగన్ చెప్పబోతున్నారు. పనిలోపనిగా తన పర్యటనల విషయంపైన కూడా క్లారిటి ఇవ్వబోతున్నట్లు సమాచారం. మొత్తానికి జిల్లాల అధ్యక్షులుగా, ప్రాంతీయ సమన్వయకర్తలుగా మాజీ మంత్రులకు జగన్ పెద్ద బాధ్యతలే పెట్టినట్లు అర్ధమవుతోంది. మరి జగన్ టార్గెట్లను వీళ్ళు అందుకుంటారో లేదో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates