ఈ మద్యనే చెప్పినట్లు జనసేన అధినేత కౌలు రైతుల కోసం భరోసా యాత్ర మొదలు పెడుతున్నారు. తన యాత్రను పవన్ అనంతపురం జిల్లాలోని కొత్తచెరువు నుంచి మంగళవారం ప్రారంభిస్తున్నారు. తన యాత్రలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం అందించబోతున్నారు. అలాగే కొత్త చెరువులోని కౌలు రైతులతో గ్రామ సభ కూడా నిర్వహిస్తారు.
ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు తలా లక్ష రూపాయల ఆర్ధిక సాయాన్ని అందించబోతున్నట్లు పవన్ ఈ మధ్యనే ప్రకటించిన విషయం తెలిసిందే. పవన్ అప్పట్లో చెప్పినట్లు అనంతపురం, కర్నూలులో సుమారు 230 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీళ్ళందరి కుటుంబాలను పరామర్శించటమంటే ఒక విధంగా రాజకీయ యాత్రనే చెప్పాలి. ఎందుకంటే కౌలు రైతుల భరోసా యాత్రంటే ఇది ఫక్తు రాజకీయ కార్యక్రమం తప్ప ఇంకోటి కాదు.
ఏదో పేరుతో జనాల్లో ఉండటమే పవన్ వ్యూహం. సరే కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయటమంటే వాళ్ళని ఎంతోకొంత ఆదుకోవటంగానే చూడాలి. అంటే పవన్ కోణంలో రాజకీయ కార్యక్రమమే అయినా కౌలు రైతుల కుటుంబాల కోణంలో చూస్తే మంచి కార్యక్రమమే అనటంలో సందేహం లేదు. చనిపోయిన కౌలు రైతులు రెండు జిల్లాల్లోను ఎక్కడెక్కడో ఉంటారు కాబట్టి రెండు జిల్లాలను పవన్ కవర్ చేసినట్లుంటుంది.
ఎలాగూ షెడ్యూల్ ఎన్నికలకు ఉన్నది రెండేళ్ళు మాత్రమే. ఈలోగా ఏదో కారణంతో జనాల్లో ఉండేట్లుగా పవన్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రజా సమస్యలపై స్పందన పేరుతో జనసేన నేతలు+శ్రేణులు జనాల్లో తిరుగుతున్నారు. వివిధ అంశాలను తీసుకుని పార్టీ నేతలు రెగ్యులర్ గా జనాల దగ్గరకు వెళ్ళి మాట్లాడుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో చీకట్లో బాణం వేసినట్లు కాకుండా రాబోయే ఎన్నికలను పవన్ సీరియస్ గా తీసుకున్నట్లే అనుకోవాలి. మొన్నటి ఎన్నికల్లో ప్రజా సమస్యలపై ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోకుండా ఏదో గాలివాటుగా అక్కడక్కడ బహిరంగ సభలు నిర్వహించేసి ఎన్నికల్లో పోటీ చేశారు. దాని ఫలితమే తల బొప్పి కట్టడం. అందుకనే ఇపుడు కాస్త ప్లానుతో వెళుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates