ఇన్ని రోజుల పార్టీలో అంతర్గత కలహాలు.. విభేధాలు.. క్రమశిక్షణ ఉల్లంఘన.. ఇలా అస్తవ్యస్తంగా సాగుతున్న తెలంగాణ కాంగ్రెస్‌పై అధిష్ఠానం తాజాగా దృష్టి సారించింది. తెలంగాణలోని కీలక నేతలతో కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు.. పార్టీ బలోపేతంపై ఆయన చర్చించినట్లు సమాచారం. తెలంగాణలో పుంజుకునేందుకు కాంగ్రెస్‌కు మంచి అవకాశాలున్నాయని భావించిన ఆయన.. పార్టీని అధికారంలోకి తీసుకు రావడం కోసం కలిసికట్టుగా పనిచేయాలని నాయకులు సూచించారు. అయితే వచ్చే ఎన్నికల దిశగా పార్టీని సిద్ధం చేసే పని టీపీసీసీ చేతిలో లేదని తెలుస్తోంది. ఎన్నికల వ్యూహకర్త సునీల్‌కు ఆ బాధ్యత అప్పగించినట్లు సమాచారం.
తప్పుదోవ పట్టించారని..
తెలంగాణ ఇచ్చిన రాష్ట్రంగా ప్రజల ఆదరణను పొందడంలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా విఫలమైంది. గత రెండు ఎన్నికల్లోనూ రాష్ట్రంలో జనాల ఓట్లు పొందలేకపోయింది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని పార్టీ నాయకులు ప్రజల్లోకి బలంగా ఎక్కించలేకపోయారు. ఎలాంటి వ్యూహాలు లేకుండానే 2014, 2018 ఎన్నికల్లో దిగిన కాంగ్రెస్ బొక్కబోర్లా పడింది.
చివరకు అధినేత్రి సోనియా గాంధీతో రాష్ట్రంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో ఆ ఎన్నికల్లో ఓటమికి కాంగ్రెస్ స్థానిక నాయకత్వమే కారణమని హైకమాండ్ భావిస్తుందని తెలిసింది. క్షేత్రస్థాయి పరిస్థితులు గురించి సరైన సమాచారం ఇవ్వకుండా కచ్చితంగా గెలుస్తామని తమను తప్పుదోవ పట్టించారని అధిష్ఠానం అనుకుంటోంది. అందుకే ఈ సారి స్థానిక నాయకత్వానికి ఎన్నికల ప్రక్రియ బాధ్యతను అప్పగించే అవకాశాలు కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వాటిపైనే ఆధారం..
తెలంగాణలో కాంగ్రెస్‌కు బలం ఉంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తల అండ ఉంది. పైగా ఇటు టీఆర్ఎస్‌పై, అటు బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కష్టపడితే అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదు. అందుకే ఈ సారి వ్యూహాత్మకంగా వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రశాంత్ కిషోర్ టీమ్‌లో మొన్నటివరకూ సభ్యుడిగా ఉన్న సునీల్‌ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకుంది. సునీల్ బృందం తెలంగాణ అంతటా పర్యటించి పార్టీ పరిస్థితిపై నివేదిక అందించనుంది. అలాగే అభ్యర్థులు ఎంపికపైనా సర్వేలు చేసి అధిష్టానానికి రిపోర్ట్ ఎప్పటికప్పుడూ పంపనుంది. సునీల్ నివేదికల ఆధారంగానే ఈ సారి అభ్యర్థుల ఎంపిక ఉంటుందని సమాచారం. ఇటీవల తెలంగాణ నాయకులకు రాహుల్ గాంధీ ఈ విషయమే చెప్పారంటా. అభ్యర్థుల ఎంపిక పీసీసీ చేతుల్లో ఉండదని స్పష్టం చేశారని తెలిసింది. ఇక పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహించాలని రాష్ట్ర నేతలకు రాహుల్ సూచించారు.