ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. కొత్త మంత్రుల జాబితాను సీఎం జగన్ ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ నెల 11న తన నూతన మంత్రివర్గాన్ని ప్రకటించనున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన మంత్రివర్గ కూర్పును సిద్ధం చేశారనే టాక్ వినిపిస్తోంది. 2024లో గెలిచి అధికారాన్ని కాపాడుకోవాలనే పట్టుదలతో జగన్ ఉన్నారు. అందుకే ఆ మేరకు మంత్రివర్గాన్ని సిద్ధం చేస్తున్నారు.
ఇక మరోవైపు దీనికంటే ముందుగానే ఆయన ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్ష నిర్వహించారని తెలిసింది. నియోజకవర్గంలో వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని ఖరాకండీగా జగన్ చెప్పారని తెలిసింది. దీంతో పనితీరు సరిగ్గా లేదని భావిస్తున్న ఎమ్మెల్యేలు ఇప్పుడు జగన్ వార్నింగ్‌తో సజ్జల రామకృష్ణారెడ్డి వద్దకు క్యూ కడుతున్నారని తెలిసింది. తమ పనితీరు మార్చుకుంటామని వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కేలా చూడాలని సజ్జలకు మొర పెట్టుకుంటున్నారని టాక్. పార్టీలో ఇప్పుడు జగన్ తర్వాత ఎవరంటే సజ్జల పేరే వినిపిస్తోంది. అందుకే ఆయన దగ్గరకు ఎమ్మెల్యేలు వరుస కట్టారని అంటున్నారు.
సర్వేల ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులు ఎంపిక ఉంటుందని జగన్ ఇటీవల తేల్చి చెప్పారు. దీంతో దాదాపు 70 నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లోను మార్చే అవకాశం ఉందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశం ఉందని అంటున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు తమ వ్యాపారాల కోసం హైదరాబాద్, బెంగళూరులోనే ఉంటున్నారని వైసీపీ అధినేతకు నివేదికలు అందాయి. ప్రకాశం, తూర్పు గోదావరి, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలపై ఎక్కువ ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ప్రజలకు అందుబాటులో లేని వీళ్లపై వ్యతిరేకత పెరుగుతుందని టాక్.
ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందా లేదా అనే డౌటు మొదలైంది. అందుకే దాదాపు పదిహేను మంది ఎమ్మెల్యేలు ఇటీవల సజ్జలను కలిశారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ల కోసమే వీళ్లు సజ్జలను కలిసినట్లు సమాచారం. ఇక నుంచి నియోజకవర్గంలోనే ఉంటామని జగన్‌కు చెప్పి మరో అవకాశం ఇప్పించాలంటూ సజ్జలకు మొరపెట్టుకున్నారని టాక్. సజ్జల తలుచుకుంటే తమకు ఏ ఢోకా ఉండదనే నమ్మకంతో ఈ ఎమ్మెల్యేలు ఆయనకు దగ్గరకు క్యూ కడుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.