మిత్రపక్షాలు బీజేపీ-జనసేన నేతల వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. పొత్తు కంటిన్యూ అయ్యే విషయంలో బహుశా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరిపై బీజేపీ నేతల్లో అనుమానాలు పెరిగిపోతున్నట్లుంది. అందుకనే పదే పదే జనసేనతో బీజేపీకి పొత్తుంటుందని చెబుతున్నారు. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతు బీజేపీ-జనసేన మధ్య పొత్తు కంటిన్యూ అవుతుందని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.
తమ రెండు పార్టీలు కలిసే పనిచేస్తాయని పురందేశ్వరి చెప్పారు. పనిలో పనిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు పార్టీలు ఉమ్మడి పోరాటాలు చేస్తాయన్నారు. నిజానికి రెండు పార్టీలు పేరుకు మాత్రమే మిత్రపక్షాలు. ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో రెండు పార్టీలు కలిసి చేసిందేమీలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు పార్టీలు చేసిన ఆందోళనలే తక్కువ. చేసిన ఆందోళనల్లో కూడా రెండు పార్టీలు దేనికదే విడి విడిగానే చేశాయి.
ఇదే సమయంలో జనసేన ఆధ్వర్యంలో జరిగిన సమావేశాలు కానీ లేదా బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సమావేశంలో కానీ రెండో పార్టీ నేతలే కనబడటం లేదు. జనసేన ఆవిర్భావ సభకు బీజేపీ నేతలను పిలవలేదు. అలాగే కడపలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో జనసేన ముఖ్యులు ఎవరు కనబడలేదు. నిజానికి రెండు పార్టీల మధ్య చాలా గ్యాప్ ఉందన్న విషయం అందరికీ తెలుసు. పవన్ ఏమో తెలుగుదేశం పార్టీతో పొత్తు గురించి ఆలోచిస్తున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనని పవన్ చేసిన ప్రకటన దీనికి ఊతమిచ్చింది.
అప్పటినుండి జనసేనతో పొత్తు కంటిన్యూ అవుతుందని, తమ రెండు పార్టీలు కలిసే ఉన్నాయని బీజేపీ నేతలు పదే పదే చెప్పుకుంటున్నారు. అంటే వీళ్ళల్లో అభద్రత కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఒకవేళ పవన్ గనుక పొత్తును తెంచేసుకుంటే బీజేపీ పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. బీజేపీకి మొన్నటి ఎన్నికల్లో వచ్చిన ఓటుబ్యాంకు 0.54 శాతం. పవన్ వదిలేస్తే బీజేపీ ఓటుబ్యాంకు మరింతగా పడిపోతుందేమో. బీజేపీకన్నా నోటా (నన్ ఆఫ్ ది ఎబోవ్)కు ఎక్కువ ఓట్లు రావటమే పార్టీ పరిస్ధితిని వివరించి చెబుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates