ఏపీలో కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేశారు. అవికూడా జగన్ మార్క్ జిల్లాలుగా ఏర్పాటయ్యాయనే చర్చ సాగుతోంది. పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ కోసమే జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేసినట్టు ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారు. పలు జిల్లాలకు ముఖ్య పట్టణాలు మారాయన్నారు. ఏపీ జిల్లాలు 13 నుంచి 26కు పెంచినట్లు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న జిల్లాల కు తోడుగా.. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీ సత్యసాయి, తిరుపతి, అన్నమయ్య జిల్లాలు ఏర్పాటయ్యాయి.
అంతేకాదు.. నిన్నటి వరకు సగటు జిల్లా జనాభా 38.15 లక్షలు ఉన్న జిల్లాలు.. ఇప్పుడు జిల్లాల విభజనతో సగటు జనాభా 19.07 లక్షలకు చేరింది. 18 లక్షల నుంచి 23 లక్షల జనాభా ఉండేలా జిల్లాల విభజన జరిగింది. ఇక, రెవెన్యూ డివిజన్లను 51 నుంచి 72కు పెంచారు. అయితే.. ఈ జిల్లాల కూర్పుతో ప్రజలకు ఒనగూరే ప్రయోజనం ఏంటి? ఇప్పటి వరకు జరగని అభివృద్ధి ఇప్పుడు జరిగిపోయి.. ప్రజల జీవితాల్లో మార్పులు వచ్చేస్తాయా? సీఎం జగనే చెప్పినట్టు.. పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ కోసమే ఇలా జిల్లాలను విభజించారా? లేక.. దీనివెనుక మరేదైనా.. `గోప్యమైన కీలక కారణం` ఉందా? అనేది ఇప్పుడు చర్చకు వస్తున్న విషయం.
ముందుగా సీఎం చెప్పిన విషయాన్నే చర్చించుకుంటే.. పాలనా సౌలభ్యం కోసం.. జిల్లాలను ఏర్పాటు చేశామని అన్నారు. దీనిని కొట్టేయడానికి అవకాశం లేదు. ఇంతకు ముందు.. 38 లక్షల(జిల్లాకు) మంది జనాభాకు కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు.. ఒక కలెక్టర్, ఒక ఎస్పీ ఉండేవారు. దీంతో జిల్లా మొత్తాన్ని సమన్వయం చేయడం.. కొంత ఇబ్బందే కాబట్టి.. కొత్త జిల్లాల ఏర్పాటుతో జనాభా సంఖ్య(ఒక్కొక్క జిల్లాకు 19 లక్షల మంది) తగ్గుతుంది కనుక.. పాలనలో వెసులుబాటు వచ్చే అవకాశం ఉంది. దీనిని కొట్టిపారేయడానికి లేదు. అయినప్పటికీ.. ఇది కలెక్టర్లు, ఎస్పీల పనితీరుపైనే ఆధారపడి ఉంటుంది. వారు చేయాలని అనుకుంటే.. అప్పుడైనా చేసిన వారు ఉన్నారు. కాబట్టి.. జనాభా సంఖ్య ప్రామాణికం కానప్పటికీ.. సీఎం వ్యాఖ్యలను సమర్ధించకుండా ఉండలేం.
ఇక, సీఎం జగన్ చెప్పిన మరో మాట.. అభివృద్ధి. జిల్లాల ఏర్పాటుతో అభివృద్ధి వేగంగా జరుగుతుందని అన్నారు. అభివృద్ధి అంటే.. మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల నిర్మాణం.. పెండింగులో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులు.. పెట్టుబడుల రాక ఇలా కొన్ని అంశాలు ఉంటాయి. అయితే.. వీటిని జిల్లాల విభజనకు ముడిపెట్టాల్సిన అవసరం లేదనేది పరిశీలకుల మాట. అభివృద్ధి చేయాలనే సంకల్పం.. చేతిలో నిధులు ఉంటే.. జిల్లాల విభజనతో సంబంధం లేకుండానే చేయొచ్చు. కానీ.. ఇప్పుడు ప్రభుత్వానికి చేతిలో నిధులు లేకుండా పోవడమే(ఇలా చేసుకున్నారనే వాదన ఉంది) పెద్ద సమస్య తప్ప.. పెద్ద జిల్లాలుగా ఉన్నందున మాత్రం కాదు. సో.. సీఎం చేసిన రెండో వాదనలో పసలేదని అంటున్నారు.
అంటే.. ప్రజలకు జిల్లాల విభజనతో వచ్చే అభివృద్ది లాభం ఎక్కడా కనిపించడం లేదు. మరి పరిశీలకులు చేస్తున్న వాదన చూద్దాం.. జిల్లాల విభజన వెనుక.. సర్కారు భారీ ఆదాయంపై కన్నేసిందనేది.. వీరి వాదన. నిజమే. ప్రస్తుతం ప్రభుత్వ ఖజానా కొల్లబోతోంది. అప్పులే తప్ప రాబడి కనిపించడం లేదు. ఎన్ని పన్నులు వడ్డించినా.. ఖజానాలో రూపాయి కాసు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మరింత ఆదాయం పెంచుకోవడంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. ఉభయ కుశలోపరి ఫార్ములాను తెరమీదికి తెచ్చింది. అంటే.. ఎలానూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన జిల్లాల ఏర్పాటు వాదనను అమలు చేస్తున్నామనే రాజకీయ లబ్ధిని సొంతం చేసుకోవడంతోపాటు.. అదేసమయంలో తమ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు జిల్లాల విభజనను తెరమీదికి తెచ్చిందని అంటున్నారు.
ఆదాయం ఎలా వస్తుందంటే!
రాష్ట్ర సర్కారు.. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసీ చేయడంతోనే పెద్ద ఎత్తున ప్రతిజిల్లాకు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల ఏర్పాటు నుంచే.. ఆయా జిల్లాల్లోని జిల్లా కేంద్రాల చుట్టుపక్కల పది కిలో మీటర్ల వరకు ఉన్న పరిధిలో భూముల విలువను అమాంతం పెంచేసింది. ఆయా భౌగోళిక పరిస్థితులను అనుసరించి.. మార్కెట్ వాల్యూను మించి పోయేలా.. ప్రభుత్వం భూముల విలువ పెంచింది. ఫలితంగా.. ఇప్పటి వరకు ఉన్న భవనాలు.. ఇళ్లకు సంబంధించిన ధరలు పెరిగాయి. ఇది మంచిదే కదా! అనుకున్నా.. దీనిలో నే అసలు కిటుకు ఉంది. ధరలు పెరిగిపోవడంతో.. ప్రభుత్వానికి వచ్చే ఇంటి పన్ను, నిర్మాణాలకు సంబంధించిన ప్లాన్ల అనుమతుల వ్యయం.. నీటి కుళాయిల పన్ను, అద్దె విలువపై పన్ను.. ఇలా.. పలు రూపాల్లో ప్రభుత్వానికి పన్నుల ఆదాయం మూడింతలు పెరిగిపోయింది.
అదికూడా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే కావడంతో ఎవరికి ఎలాంటి మినహాయింపులు లేకుండా పోయాయి. సో.. సర్కారు వారికి చేతి నిండా పన్నుల ఆదాయంతోపాటు రిజిస్ట్రేషన్ల ఆదాయం.. కూడా వచ్చి పడుతుంది. పోనీ.. దీనివల్ల ప్రజలకు ఏమైనా లాభం ఉందా? అంటే.. తమ భూముల ధరలు పెరిగాయని చెప్పుకొని చంకలు గుద్దుకోవడం తప్ప.. ఏమీ లేదు. ఎందుకంటే.. వాటిని కొనేందుకు ఎవరైనా ముందుకు వస్తేనే కదా.. అప్పుడు జనాలకు లబ్ధి. అప్పుడు కూడా అమ్మకంపై పన్ను, రిజిస్ట్రేషన్ చార్జీల రూపంలో సర్కారు వారికి సొమ్ములు చేరడం ఖాయం. రియల్ ఎస్టేట్ జరిగినా.. అది కూడా ప్రభుత్వానికి ఆదాయమే. ఏతావాతా ఎలా చూసుకున్నా.. ఒక చేత్తో ఇచ్చి రెండు చేతులతో తీసుకున్న చందంగా.. ఈ జిల్లాల విభజన ఉందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on April 5, 2022 12:02 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…