ప్రజాభిప్రాయం పరిగణించకుండా జిల్లాల విభజన చేశారని.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మండిపడ్డారు. పాలకుల చిత్తానికి తోచినట్లు ముందుకెళ్లారని విమర్శించారు. ఈ విభజన లోపభూయిష్టం గా సాగిందన్నారు. పార్లమెంట్ నియోజకవర్గమే ప్రామాణికం అంటూ.. ప్రజల మనోగతాన్ని, కొత్త జిల్లాల మూలంగా వాళ్లు ఎదుర్కొనే ఇబ్బందులను ఎందుకు పరిగణించలేదని ప్రశ్నించారు. ఎప్పటినుంచో జిల్లా కోసం డిమాండ్ ఉన్న ప్రాంతాలపై అధ్యయనం కూడా చేయలేదని ధ్వజమెత్తారు. త్వరలోనే తాను జిల్లాల పర్యటన చేపట్టి.. ప్రజాభీష్టాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తానని అన్నారు.
పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాతో పోలవరం ముంపు మండలాల గిరిజనులకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని పవన్ అన్నారు. ఎటపాక, కుక్కునూరు లాంటి మండలాల ప్రజలు.. జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే కనీసం 300 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుందని గుర్తు చేశారు. అంటే ఆ ప్రాంత గిరిజనులు జిల్లా కేంద్రంలో ఉన్న అధికారిని కలవాలంటే కనీసం 2 రోజుల సమయం పడుతుందన్నారు. ఈ తరహా విభజనతో ప్రజలకు ఏ విధంగా పాలన చేరువ చేస్తున్నారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రంపచోడవరం కేంద్రంగా జిల్లా కావాలన్న అక్కడి గిరిజనుల అభిప్రాయాన్ని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రాయలసీమలోనూ మదనపల్లె, హిందూపురం, మార్కాపురం కేంద్రాలుగా జిల్లాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్లను పరిగణనలోకి తీసుకోకపోవడం పద్ధతి కాదన్నారు. జిల్లాల ఏర్పాటు చేయడానికి ముందు, ముసాయిదా వచ్చిన తర్వాత కూడా రాజకీయ పార్టీలు, ప్రజలు అభిప్రాయాలను తీసుకోలేదని.. వినతులను బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు.
జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో లోపాలపై ప్రజలు చేసే ఆందోళనలకు జనసేన అండగా ఉంటుందన్నా రు. ప్రజా సౌకర్యమే ప్రధానంగా జిల్లాలను పునర్వ్యవస్థీకరించే బాధ్యతను.. జనసేన తీసుకుంటుందని పవన్ హామీ ఇచ్చారు. దీనికి ముందు.. తర్వాత.. కూడా మార్పులు తీసుకువచ్చేలా.. జనసేన ప్రయత్నిస్తుందని చెప్పారు. అంతేకాదు… ప్రజా ఉద్యమాలకు కూడా జనసేన మద్దతిస్తుందని తెలిపారు. త్వరలోనే జిల్లాల్లో పర్యటించి.. ప్రజల కష్టాలు తెలుసుకుని.. వారి అభిప్రాయాల మేరకు.. ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates