జూన్ 21న ఈ ఏడాదికిగాను అతిపెద్ద సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం.. సూర్యగ్రహణం కారణంగా గ్రహాల నక్షత్రరాశులలో మార్పులు సంభవించనున్నాయి. ఈ ఏడాది ఇదే తొలి సూర్యగ్రహణం కావడం గమనార్హం. జ్యోతిషశాస్త్రం ప్రకారం కరోనా వైరస్ గతేడాది డిసెంబరులో ఏర్పడిన సూర్యగ్రహణంతోనే ప్రారంభమైంది. ఈ సూర్యగ్రహణంతో కరోనా ప్రభావం ముగుస్తుందని చాలామంది అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో సూర్యుడు మరింత ప్రకాశవంతంగా వెలగనున్నాడని, సూర్యరశ్మి ధాటికి కరోనా వైరస్ మటుమాయం అవుతుందని ప్రచారం జరుగుతోంది. దీనికితోడు చెన్నైకి చెందిన న్యూక్లియర్ అండ్ ఎర్త్ సైంటిస్ట్ డాక్టర్ సుందర్ కృష్ణ కూడా…ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో, ఆ వాదనలకు బలం చేకూరింది. దీంతో, ఈ సూర్యగ్రహణం మహమ్మారికి ముగింపు పలకనుందని సోషల్ మీడియాలో మెసేజ్ లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ సూర్య గ్రహణం వల్ల నిజంగానే కరోనా మహమ్మారి నశిస్తుందా? కరోనాకు సూర్యగ్రహణానికి సంబంధం ఉందా? అని గూగుల్ తల్లిని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అయితే, సూర్య గ్రహణం వల్ల కరోనా నశించదని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు తేల్చేశారు.
అయితే, ఈ సారి వచ్చే సూర్యగ్రహణం నాడు చంద్రుడు నీడ సూర్యుడిని దాదాపు 99 శాతం కప్పనుంది. ఇలాంటి గ్రహణం ప్రతి 18 ఏళ్లకోసారి వస్తుంది. ఢిల్లీ, ఛండీగఢ్, ముంబయి, హైదరాబాద్, కోల్ కతా, బెంగళూరు పట్టణాల్లో ప్రజలు పాక్షిక సూర్యగ్రహణాన్ని చూడనున్నారు. జూన్ 21న 10.31 గంటలకు ప్రారంభం కాగా.. మధ్యాహ్నం 2.30 గంటలకు ముగుస్తుంది. దాదాపు 3 గంటల 33 నిమిషాలకు పూర్తి గ్రహణం ఏర్పడనుంది.కేవలం 30 సెకన్ల పాటు గ్రహణం ఉంటుంది. అయితే, కరోనాకు సూర్య గ్రహణానికి ఒక సారూప్యత మాత్రం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. సూర్యగ్రహణం నాడు సూర్యుడి చుట్టు కిరీటాల్లాంటి ఆకారాలుంటాయని…కరోనా వైరస్ చుట్టూ ఉండే కిరీటాన్ని అవి పోలి ఉంటాయని చెబుతున్నారు. అంతకు మించి మరేమీ లేదని…సూర్య గ్రహణం వల్ల కరోనా నశించదని చెబుతున్నారు. భౌతిక దూరం పాటించడం, చేతులు తరచుగా శుభ్రం చేసుకోవడం, మాస్క్ ధరించడం వంటివి చేయడం వల్లే కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోగలమని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates