అంబ‌టికి..రోజాకు నో ఛాన్స్..ఆశ ప‌డొద్దు! 

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఇద్ద‌రికి ఛాన్స్ ఉంద‌ని వార్త‌లొస్తున్నాయి. వారిలో ఒక‌రు అంబ‌టి రాంబాబు కాగా మ‌రొక‌రు రోజా. గుంటూరు జిల్లా కోటాలో అంబ‌టి ఛాన్స్ కొట్టేసేందుకు లాబీయింగ్ చేస్తున్నార‌ని టాక్. 1989లో తొలిసారి రేపల్లె నియోక‌వ‌ర్గం త‌రఫున ఎన్నిక‌యిన త‌రువాత చాలా ఏళ్ల‌కు ఎమ్మెల్యే అయిన అంబ‌టి ప్ర‌స్తుతం సత్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

ఎప్ప‌టి నుంచో వైసీపీకి న‌మ్మిన బంటులా ఉన్నారు. పార్టీ సిద్ధాంతాలు జ‌నంలోకి తీసుకెళ్లేందుకు తెగ తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. కొన్ని వివాదాల‌కు కూడా ఆజ్యం పోశారు. కొన్ని వివాదాస్పద ఆడియో టేపుల్లో కూడా దొరికి పోయారు. ఆ త‌రువాత ఆయ‌న ఎన్ని మాట‌లు చెప్పినా అవేవీ న‌మ్మ‌శ‌క్యంగా లేవ‌ని తేలిపోయింది..అని విప‌క్షం అంటోంది. వివాదాల మాట ఎలా ఉన్నా వైఎస్సార్ కుటుంబానికి మాత్రం వీర విధేయుడిగా ఉన్నారు. అయితే ఈ ప్రాంతం నుంచి విడ‌ద‌ల ర‌జ‌నీ కూడా మంత్రి ప‌ద‌వే కోరుతున్నారు.
ఆమెకు కూడా క‌ష్ట‌మే అని అంటున్నారు.

ఏదేమ‌యిన‌ప్ప‌టికీ ఉమ్మ‌డి గుంటూరు జిల్లాకు సంబంధించి ఒక మైనార్టీ వ‌ర్గంకు చెందిన ఎమ్మెల్యేకు ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. ఇక రోజా విష‌యానికే వ‌స్తే న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం త‌ర‌ఫున వ‌రుస‌గా రెండో సారి ఎన్నికై, ప్ర‌స్తుతం ఫైర్ బ్రాండ్ పొలిటీషియ‌న్ గా పేరు తెచ్చుకున్నారు. ఆ రోజు విప‌క్షంలో పార్టీ ఉన్న‌ప్పుడు అన్నీ తానై జ‌గ‌న్ త‌ర‌ఫున మాట్లాడారు. ఎన్నో సార్లు ఫ్లోర్ లో అవ‌మానాలు పొందారు. స‌స్పెండ్ అయ్యారు. పార్టీ ఆదేశాల మేరకు విప‌క్షాన్ని తిట్టిపోశారు. ముఖ్యంగా చంద్ర‌బాబు నాయుడ్ని అంద‌రి క‌న్నా ఎక్కువ‌గా తిట్ట‌డంలో ఆ రోజు ఆమే ముందున్నారు.

ఆ త‌రువాతే కొడాలి నాని సీన్ లోకి వ‌చ్చారు. ఏపీఐసీసీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చారు కానీ అదేమంత ప్రాధాన్య‌మయిన ప‌ద‌వి కాదు.ఆ ప‌ద‌వీ కాలం కూడా ముగిసిపోయింది. జిల్లా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం ఇప్పుడు చిత్తూరులోకి పోయింది. కానీ ఇలా వ‌ద్ద‌ని త‌మ‌ను తిరుప‌తి జిల్లాలోనే ఉంచాల‌ని వేడుకున్నా
ఫ‌లితం లేక‌పోయింది. దీంతో ఆమె పై మ‌ళ్లీ పెద్ది రెడ్డి ఆధిప‌త్యం ఉండ‌నుంది. పెద్దిరెడ్డి వర్గంతో యుద్ధం చేస్తున్నరోజా కు మంత్రి ప‌ద‌వి క‌ష్ట‌మే ! అంతేకాదు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌ఫున ఆమె టికెట్ రావ‌డం కూడా  క‌ష్ట‌మే అని తెలుస్తోంది.