రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తాను ప్రవేశ పెట్టిన, అమలుచేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు మద్యం ద్వారా వచ్చే ఆదాయమే కారణమని చెప్పారు. దీనిని చాలా మంది నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వాస్తవానికి ప్రతిపక్ష నేత హోదాలో ఎన్నికలకు ముందు మద్య నిషేధం అంటూ జగన్ పదేపదే చెప్పిన విషయం తెలిసిందే. తాను అధికారంలోకి రాగానే దశల వారీగా మద్య నిషేధం అమలు చేసి, మూడేళ్లలోనే రాష్ట్రంలో మద్యం అన్నది లేకుండా చేస్తామన్నారు.
కానీ, ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సాక్షిగా మద్యంపై వచ్చే ఆదాయమే తమకు ప్రధానమని, ఆ డబ్బులతోనే అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ కుండబద్దలు కొట్టేశారు. మద్యం తాగే బలహీనతను ఆసరాగా చేసుకుని.. తద్వారా ఆదాయం లాక్కుని.. అవే డబ్బులతో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఇదే సంక్షేమ రాజ్యమని చెప్పడం ద్వారా మద్య నిషేధం హామీని తుంగలో తొక్కారని నెటిజన్లు తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారు.
మద్యంపై వచ్చే ఆదాయాన్ని, మద్యం నిల్వల్ని కొన్నేళ్లపాటు హామీగా చూపించి కార్పొరేషన్ల ద్వారా ఇప్పటికే రూ.వేల కోట్ల రుణాలు తీసుకోవడం.. చేయూత, అమ్మ ఒడి, ఆసరా వంటి సంక్షేమ పథకాల అమలుకు మద్యంపై వచ్చే ఆదాయాన్ని వినియోగిస్తామంటూ ఆ పథకాల అమలు బాధ్యతను మద్యం అమ్మే ఏపీఎస్‌బీసీఎల్‌కు అప్పగించడం, అందుకు ఏకంగా చట్టాన్నే సవరిస్తూ ఆర్డినెన్సు తీసుకొచ్చి అందులో ఆ విషయాన్ని ప్రస్తావించడం మద్య నిషేధ హామీకి తూట్లు పొడవడం కాక మరేమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
మద్యం ద్వారా రాష్ట్రానికి డబ్బులు రాకూడదన్నదే చంద్రబాబు ఉద్దేశమని.. మద్యం డబ్బులు వస్తే అక్కచెల్లెమ్మలకు మేలు కలుగుతుందని, అది జరగకూడదనే ప్రతిపక్షం భావిస్తోందని సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. అంటే.. తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నింటినీ మద్యం ఆదాయంతోనే అమలుచేస్తోందని చెప్పకనే చెప్పారు. మరి మద్యనిషేధం మాట ఏమైనట్లు? ఆ ఆదాయం ఆగిపోతే… పథకాలూ ఆగిపోతాయా? అనేది కీలక ప్రశ్న.
ఇక్కడే నెటిజన్లు మరో ఆసక్తికర విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. నిజానికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్రాలు కూడా అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. మరి ఆయా పథకాలకు డబ్బులు ఎక్కడ నుంచి తెస్తున్నారు. కేంద్రం నేరుగా మందు అమ్మదు. రాష్ట్రాల్లోనూ మద్యంపైనే ఆదాయం వస్తుందని.. ఏపీలో మాదిరిగా ఆశలు పెట్టుకోరు. మరి అక్కడ ఏం చేస్తున్నారు. అభివృద్ధి బాట పడుతున్నారు. పలితంగా పన్నులు.. ఇతరత్రా.. అభివృద్ధి వల్ల రాష్ట్రాలకు ఆదాయం వస్తోంది. మరి ఏపీపరిస్థితి ఇలా కాకుండా.. కేవలం మద్యంపైనే ఆధారపడి ముందుకు సాగుతామంటే.. జగన్ మరోసారి గెలిచేనా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
Gulte Telugu Telugu Political and Movie News Updates