తప్పులు చేయటం తర్వాత తీరిగ్గా దిద్దుకోవటం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. గతంలో ప్రభుత్వం నియమించిన స్మార్ట్ సిటి ఛైర్మన్లతో ఇపుడు రాజీనామాలు చేయించటం ఇందులో భాగమే. తనకు లేని అధికారాలను చేతుల్లోకి తీసుకోవటం లేదా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించటం తర్వాత సమస్య ఎదురైతే తల పట్టుకోవటం మామూలైపోయింది. దేశంలోని కొన్ని నగరాలను, పట్టణాలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులో భాగంగా కొన్నింటిని స్మార్ట్ సిటి పథకంలో ఎంపికచేసింది. అలా దేశంలో ఎంపికైన నగరాల్లో కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి కూడా ఉన్నాయి. వీటిని ఎలా డెవలప్ చేయాలి, అందుకు ప్రణాళిక తయారు చేయటం, నిధుల విడుదల, ఖర్చు, పర్యవేక్షణ మొత్తం కేంద్ర ప్రభుత్వానిదే. పై వ్యవహారాలన్నీ సజావుగా జరిగేందుకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఛైర్మన్ గా ఉంటారు. అలాగే ఆయా మున్సిపల్ కమిషనర్లు ఇన్చార్జిలు.
ఇందులో ఎక్కడ కూడా రాజకీయ నేతల ప్రమేయమే ఉండదు. అయినా సరే జగన్ ప్రభుత్వం వైసీపీ నేతలను స్మార్ట్ సిటీలకు ఛైర్మన్లుగా నియమించింది. నిజానికి ఛైర్మన్లుగా పార్టీ నేతలను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కానీ ముందు వెనకా చూసుకోకుండా జగన్ డిసైడ్ చేయగానే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేసేశారు. జగన్ చేసిందే తప్పంటే, ఉన్నతాధికారులు ఉత్తర్వులు రిలీజ్ చేయటం అంతకన్నా తప్పు. జగన్ కు నిబంధనలు తెలియకపోవచ్చు కానీ కేంద్ర మార్గదర్శకాలను తెలియజేయాల్సిన అవసరం ఉన్నతాధికారులకుంది.
ఛైర్మన్లుగా నియమించిన మూడునెలల తర్వాత కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. దాంతో చేసిన తప్పును దిద్దికోవటంలో భాగంగా ఛైర్మన్లతో రాజీనామాలు చేయించారు. అసలు ఛైర్మన్లను నియమించటం ఎందుకు ? ఇపుడు రాజీనామాలు చేయించటం ఎందుకు ? అవసరమని అనుకుంటే ఛైర్మన్లుగా నియమించిన ముగ్గురిని ఇంకేదన్నా పదవుల్లో నియమించుండచ్చు. ఛైర్మన్లుగా బాధ్యతలు తీసుకున్న ముగ్గురు మూడు నెలల్లోనే రాజీనామాలు చేయటంటే వాళ్ళకు కూడా ప్రిస్టేజ్ సమస్యే. భవిష్యత్తులో ఇలాంటి నియామకాలు చేసేముందు జగన్ ఒకసారి నిబంధనలు, మార్గదర్శకాలను చూసుకుంటే బాగుంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates