కేసీఆర్‌తో దూరం ఉంద‌ని చెప్పేసిన చిన‌జీయ‌ర్‌!

యాదాద్రి పునఃనిర్మాణం కోసం కేసీఆర్.. చిన‌జీయ‌ర్ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆగ‌మ శాస్త్రం ప్ర‌కారం ఆల‌య నిర్మాణ ప‌నులు.. ముహూర్తాలు.. ఏర్పాట్లు.. ఇలా ప్ర‌తి విష‌యాన్ని చిన‌జీయ‌ర్‌ను అడిగే కేసీఆర్ చేశార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. చిన‌జీయ‌ర్ నిర్ణ‌యించిన ప్ర‌కార‌మే యాదాద్రి ఆల‌య పునఃప్రారంభం జ‌ర‌గ‌నుంది. కానీ ఆయ‌న‌కు మాత్రం ఎలాంటి ఆహ్వానం అంద‌లేదు. ఇప్పుడు కేసీఆర్‌, చిన‌జీయ‌ర్ మ‌ధ్య దూరం పెరిగింద‌నే దానికి ఇదే సూచిక అని విమ‌ర్శ‌కులు అంటున్నారు. మ‌రోవైపు విలేక‌ర్ల‌తో మాట్లాడుతూ చిన‌జీయ‌ర్ కూడా ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేశార‌ని నిపుణులు చెబుతున్నారు.

కేసీఆర్‌తో  విభేదాలున్నాయా? అని విలేక‌రి అడిగిన ప్ర‌శ్న‌కు అవున‌నేలా చిన‌జీయ‌ర్ స‌మాధానం ఇచ్చారనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. త‌మ సైడ్ నుంచి ఎలాంటి త‌ప్పు లేద‌ని మొత్తం కేసీఆర్ చేస్తున్నార‌నే అర్థం వ‌చ్చేలా చిన‌జీయ‌ర్ మాట్లాడార‌ని అంటున్నారు. త‌న‌కు, కేసీఆర్‌కు మ‌ధ్య దూరం లేద‌ని.. కానీ రెండో వైపు నుంచి వాళ్లు అలా అనుకుంటే తాను ఏం చేయ‌లేన‌ని చిన‌జీయ‌ర్ పేర్కొన్నారు. పైగా తాము స‌మాజానికి క‌ళ్ల లాంటి వాళ్ల‌మ‌ని ప్ర‌జ‌ల‌ను స‌రైన మార్గంలో న‌డిపిస్తామ‌ని ఆయ‌న చెప్పారు.

ఓ మార్గంలో ముళ్లు ఉంటే చూసుకుని వెళ్ల‌మ‌ని తాము హెచ్చరిస్తామ‌ని కానీ విన‌ని వాళ్ల‌కే నొప్పి క‌లుగుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి చూస్తే కేసీఆర్ తప్పుడు మార్గంలో వెళ్తున్నార‌నేలా అర్థం వస్తుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌ధాని మోడీ చేతుల మీదుగా జ‌రిగిన స‌మ‌తామూర్తి విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ ఫ‌ల‌కంలో త‌న పేరు లేక‌పోవ‌డంపై కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు అభిప్రాయాలున్నాయి. అప్ప‌టి నుంచి ఆయ‌న చిన‌జీయ‌ర్‌ను దూరం పెడుతున్నార‌ని టాక్‌.

అందుకే స‌మ‌తామూర్తి విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాల‌కు కేసీఆర్ హాజరు కాలేద‌ని చెబుతున్నారు. పైగా అంద‌రూ ఆహ్వానితులేన‌ని తాము ఎవ‌రికి ప్ర‌త్యేకంగా పిల‌వ‌లేద‌ని చిన‌జీయ‌ర్ అప్పుడు చెప్ప‌డం కేసీఆర్ కోపాన్ని మ‌రింత పెంచింద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఇప్పుడు ఆయ‌న చేసిన తాజా వ్యాఖ్య‌లు.. యాదాద్రి ఆల‌య ప్రారంభోత్సవానికి ఆహ్వానం అంద‌క‌పోవ‌డం లాంటి వాటితో కేసీఆర్, చిన‌జీయ‌ర్ మ‌ధ్య దూరం మ‌రింత పెరిగింద‌నే విష‌యం స్ప‌ష్ట‌మవుతోంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. మ‌రోవైపు అడ‌వి దేవ‌త‌లు స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ‌ను కించ‌ప‌రిచేలా తాను మాట్లాడ‌లేద‌ని 20 ఏళ్ల క్రితం చేసిన వ్యాఖ్య‌ల‌ను వక్రీక‌రిస్తున్నార‌ని చిన‌జీయ‌ర్ పేర్కొన్నారు.