రెబల్ ఎమ్మెల్యేతో జగన్ ఆసక్తికరమైన భేటీ

YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

శాసనసభలో గురువారం ఆసక్తికర ఘటన జరిగింది. అదేమిటంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో నెల్లూరు జిల్లా ఎంఎల్ఏ ఆనం రామనారాయణ రెడ్డి భేటీ అయ్యారు. మామూలుగా అయితే సీఎంతో ఎంఎల్ఏ భేటీ అవ్వడం చాలా సహజమే. కానీ ఇక్కడ ఎందుకని ఆసక్తిగా మారిందంటే గడచిన మూడేళ్ళుగా ప్రభుత్వంపై ఆనం తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  ఎంతో సీనియర్ అయిన తనకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదనే అసంతృప్తి జగన్ పై ఆనంలో బాగా పెరిగిపోతోంది.

ఇపుడు ఆనం పరిస్థితి ఎలా తయారయ్యిందంటే జిల్లాలోని సహచర ఎంఎల్ఏలు కానీ మంత్రులు కానీ కనీసం అధికార యంత్రాంగం కూడా పట్టించుకోవటం లేదు. ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న కారణంగానే ఆనంను అధికార పార్టీ, యంత్రాంగం దూరంగా పెట్టేసింది. దాంతో తొందరలోనే ఆనం పార్టీ మారిపోతారనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ విషయంలో కూడా ఆనం తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. పైగా తన మద్దతు దారులతో నిరాహార దీక్షలకు కూడా దిగారు.

సరిగ్గా ఇలాంటి నేపథ్యంలో ముఖ్యమంత్రితో ఆనం భేటీ అయ్యారు. దాంతో విషయం చాలా ఆసక్తిగా మారింది. అసెంబ్లీలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో ఆనం భేటీ అయ్యారు. ఆ సందర్భంగా మంత్రికి ఆనం కొన్ని కాగితాలిచ్చారు. ఆనం దగ్గరున్న కాగితాలను తీసుకున్న మంత్రి  వాటిని ముఖ్యమంత్రికి అందించారు.  తర్వాత బయటకు వచ్చేసి ఆనంను మంత్రి మళ్ళీ సీఎం దగ్గరకు తీసుకెళ్ళారు. ముఖ్యమంత్రి చాంబర్లోకి ఇద్దరు వెళ్ళిన వెంటనే మంత్రి బయటకు వచ్చేశారు. జగన్-ఆనం కాసేపు మాట్లాడుకోగానే మళ్ళీ మంత్రి లోపలకు వెళ్ళారు. ముగ్గురు కలిసి కాసేపు మాట్లాడుకున్నారు.

ఇదంతా చూస్తున్న వారికి జరిగిందంతా  విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే అసలు ఆనంను కలవటానికే జగన్ ఇష్టపడటంలేదు. అలాంటిది ముందు మంత్రి వెళ్ళి కలవటం, తర్వాత ఆనంను తీసుకెళ్ళారు. ఆనంను సీఎం దగ్గర వదిలేసి మంత్రి బయటకు వచ్చేశారు. కొద్దిసేపటికి మళ్ళీ మంత్రి కూడా చాంబర్లోకి వెళ్ళారు. ముగ్గురు కలిసి కాసేపు మాట్లాడుకున్నారు. ఇదంతా చూసిన వారికి ఆ కాగితాల్లో ఏముంది ? ఆనంను జగన్ దగ్గరకు మంత్రి ఎందుకు తీసుకెళ్ళారు . అసలు ఆనంను కలవటానికి సీఎం ఎందుకు అంగీకరించారు ? ముగ్గురు కలిసి ఏమి మాట్లాడుకున్నారనే విషయాలు ఆసక్తిగా మారాయి.