అప్పటి దేవత, ఇప్పటి దెయ్యమా?

కాంగ్రెస్ పార్టీ రాజకీయం విచిత్రంగా తయారవుతోంది. తాడే పామై కరుస్తుంది అనే సామెత కాంగ్రెస్ పార్టీని గమనిస్తే సరిగ్గా సరిపోతుంది. దశాబ్దాల పాటు గాంధీ ఫ్యామిలీయే పార్టీ నాయకత్వానికి శరణ్యమని బతిమలాడుకున్న నేతలే ఇపుడు గాంధీ ఫ్యామిలిని టార్గెట్ చేస్తున్నారు. సీనియర్ నేత కపిల్ సిబల్ మాట్లాడుతూ నాయకత్వ బాధ్యతలనుండి గాంధీ ఫ్యామిలీ స్వచ్చంధంగా పక్కకు తప్పుకోవాలని డిమాండ్ చేయడం సంచలనంగా మారింది. 

మీరు తప్ప అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు మరో నేతే లేరని ఇదే నాయకులు ఒకపుడు సోనియాగాంధిని బతిమలాడుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. పార్టీ అప్రతిహతంగా విజయాలు సాధిస్తున్న కాలంలో సోనియాను దేవతగా అభివర్ణించిన నేతలే ఇపుడు అదే సోనియా, రాహుల్ ను నాయకత్వ బాధ్యతలకు పనికిరారంటు మొహం మీద చెప్పేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అందరి నాయకత్వం కావాలి కానీ కుటుంబ నాయకత్వం కాదని సిబల్ చెప్పటం గమనార్హం. 

సరే సిబల్ వ్యాఖ్యలను పార్టీలోని చాలామంది నేతలు తప్పు పడుతున్నారు. సిబల్ వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతల వ్యాఖ్యల్లాగ ఉన్నాయంటు మండిపడ్డారు. పంజాబ్ ఎన్నికల సమయంలో చన్నీని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా రాహుల్ గాంధి ప్రకటించటాన్ని తప్పుపట్టారు. చన్నీని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించటానికి రాహుల్ కున్న అధికారం ఏమిటి ? ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించటానికి రాహుల్ ఎవరు ? అంటు సిబల్ నిలదీయటమే ఆశ్చర్యంగా ఉంది. సిబల్ లాంటి ఇదే నేతలు ఒకపుడు రాహుల్ దృష్టిలో పడటానికి ఎన్ని విన్యాసాలు వేశారో అందరికీ తెలిసిందే. 

సోనియా, రాహుల్ తో మాట్లాడేందుకు రోజుల తరబడి వెయిట్ చేసిన నేతలే ఇపుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. నిజానికి జీ-23 నేతలుగా పాపులరైన నేతల్లో గులాంనబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనందశర్మ లాంటి చాలామంది ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచేంత సీన్ లేదు. అందుకనే ఎప్పుడూ రాజ్యసభ ఎంపీలుగా ఎంపికవుతు కేంద్ర మంత్రివర్గంలో పాటు వివిధ రాష్ట్రాల్లో పార్టీ ఇన్చార్జిలుగా కూడా పనిచేశారు. అప్పట్లో వీళ్ళందరికీ సోనియా, రాహుల్ ఇష్టదైవాలు గా ఉండేవారు. పార్టీ పరిస్థితి తిరగబడేటప్పటికి సోనియా, రాహుల్ దెయ్యాలుగా కనబడుతున్నారు. అందుకనే తాడేపామై కరుస్తుందనే సామెత పాపులరైంది.