సీడ‌బ్ల్యుసీ కీల‌క నిర్ణ‌యం.. రాహుల్‌కే ప‌ట్టం?

ప‌ప్పు.. ప‌ప్పు.. అంటూ.. బీజేపీ నేత‌లు ఆట‌ప‌ట్టించి.. దేశ‌వ్యాప్తంగా ప‌రువును దిగ‌జార్చిన రాహుల్ గాంధీనే మ‌రోసారి కాంగ్రెస్ ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్నారు. ఆయ‌న త‌ప్ప‌.. మోడీని బ‌లంగా ఎదుర్కొనే నాయ‌కుడు లేరంటూ.. కాంగ్రెస్‌లో గాంధీల‌కు వీర విధేయులుగా ఉన్న‌వారు.. భ‌జ‌న ప్రారంభించారు. అది కూడా అత్యంత కీల‌క‌మైన‌.. సీడ‌బ్ల్యుసీ స‌మావేశంలోనే రాహుల్‌కు అనుకూలంగా వ్యాఖ్య‌లు చేయ‌డం.. ఆయ‌నకే తిరిగి ప‌గ్గాలు అప్ప‌గించాల‌నే దిశ‌గా అడుగులు వేస్తుండ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురిచేస్తోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ నేపథ్యంలో.. రాహుల్ గాంధీకి మరోసారి అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

రాహుల్ గాంధీలా మరే ఇతర నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎదుర్కోవడం లేదని రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, గాంధీల కుటుంబానికి వీర విధేయుడు అశోక్ గహ్లోత్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకొనే మోడీ ప్రసంగాలు ప్రారంభిస్తున్నారని, దీన్ని బట్టి రాహుల్ ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు. అటు, సీడబ్ల్యూసీ భేటీ జరుగుతున్న సమయంలో రాహుల్కు మద్దతుగా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. రాహుల్, ప్రియాంకకు మద్దతుగా నినాదాలు చేశారు. రాహుల్‌కే ప‌ట్టం క‌ట్టాల‌ని.. స‌ర్వ‌త్రా నిన‌దించారు. మ‌రోవైపు అస‌మ్మ‌తి గ‌ళాలు అంతే స్తాయిలో వినిపిస్తున్నాయి. దేశంలో బీజేపీ తర్వాత అత్యధిక మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకే ఉన్నారని జీ-23లో కీల‌క నేత‌ శశిథరూర్ పేర్కొన్నారు. పార్టీని సంస్కరించి, పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ అనేది దేశంలో విశ్వసనీయమైన విపక్ష పార్టీగా ఉందంటూ ట్వీట్ చేశారు.

గతకొద్ది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ నాయకత్వ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. 2014లో మోడీ హవాతో సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన తర్వాత.. అడపదడపా విజయాలను పక్కనబెడితే కాంగ్రెస్ కు ఎదురుదెబ్బలే ఎక్కువ తగిలాయి. ఎన్నికలు జరుగుతున్న‌ కొద్దీ… కాంగ్రెస్ కోల్పోతున్న రాష్ట్రాల జాబితా పెరుగుతూ వచ్చింది. 2012లో 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పరిస్థితి.. 2022 నాటికి రెండంటే రెండు రాష్ట్రాల స్థాయికి దిగజారింది. 2017 చివర్లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఆ తర్వాత వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ పూర్తిగా విఫలమైంది. లోక్ సభలో విపక్ష స్థానాన్నీ దక్కించుకోలేకపోయింది. 2020 జులైలో రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత పూర్తిస్థాయి అధ్యక్షులను ఎన్నుకోలేని అనిశ్చితిలో పార్టీ పడిపోయింది.

ఇక, ఐదు రాష్ట్రాల ఫలితాలు కాంగ్రెస్ అస్తిత్వానికే పరీక్షగా మారాయి. ఇన్నాళ్లూ బీజేపీకి ప్రత్యామ్నాయంగా కనీస పోటీ ఇవ్వలేకపోయిన కాంగ్రెస్ కు ఇప్పుడు ఆమ్ ఆద్మీ రూపంలో చిక్కొచ్చి పడింది. కాంగ్రెస్, బీజేపీలకు దీటుగా ఎదగాలని ఆప్ భావిస్తున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ అత్యవసరమైన సంస్కరణలను దీర్ఘకాలం పాటు చేపడితేనే పార్టీ మనుగడ సాగించేందుకు ఆస్కారం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆత్మపరిశీలన కోసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ అయంది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన భేటీకి కీలక నేతలు హాజరయ్యారు. అధినేత్రి సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, పీ చిదంబరం తదితరులు భేటీలో పాల్గొన్నారు. ఇక‌, ఈ భేటీలో చివ‌రికి రాహుల్‌నే పార్టీ అధ్య‌క్షుడిగా ఎన్నుకొనే అవ‌కాశం మెండుగా క‌నిపిస్తోంది.