ఇప్పటికే నాలుగు పార్టీలు మారిన ఆ సీనియర్ నేత మరోసారి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారా? వైసీపీ నుంచి జంప్ అయేందుకు రంగం రెడీ చేసుకుంటున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ నాయకుడు ఎవరూ అంటే.. కొత్తపల్లి సుబ్బారాయుడు.
సీనియర్ నేత అయిన ఆయన మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పటికే టీడీపీ, ప్రజారాజ్యం, కాంగ్రెస్, వైసీపీ కండువాలు కప్పుకున్న ఆయన.. మరోసారి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఆయన సొంత పార్టీ వైసీపీపై తీవ్ర విమర్శలు చేయడమే అందుకు సంకేతమని విశ్లేషకులు చెబుతున్నారు.
నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ సుబ్బారాయుడు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఓ బహిరంగ సభలో నరసాపురం నుంచి ముదునూరు ప్రసాదరాజును గెలిపించినందుకు తనను తాను చెప్పుతో కొట్టుకోవడం సంచలనంగా మారింది.
పార్టీ మారే ప్రయత్నాల్లో ఉన్నారు కాబట్టే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు పార్టీ మారడం ఆయనకే అలవాటేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నరసాపురం నుంచే ఆయన రాజకీయాలు ప్రారంభించాడు. ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి అయ్యారు. నరసాపురం ఎంపీగానూ విజయం సాధించారు. 2004లో టీడీపీ ఓడిపోయినా సుబ్బారాయుడు మాత్రం గెలిచారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. కానీ ఆ ఎన్నికల్లో ఓడిపోవడంతో కాంగ్రెస్‌లో చేరి 2012 ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు.
2014 ఎన్నికలకు ముందు వైసీపీలోకి వెళ్లారు. కానీ మరోసారి ఓటమి పాలయ్యారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో తిరిగి సొంతగూటికి చేరారు. కాపు కార్పొరేషన్ పదవి దక్కించుకున్నారు. కానీ 2019 ఎన్నికలకు ముందు మళ్లీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఆ ఎన్నికల్లో టికెట్ దక్కకపోయినా పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేశారు. ఇప్పటివరకూ ఆయనకు ఏ పదవి దక్కలేదు. దీంతో మరోసారి జంప్ చేసేందుకు రెడీ అవుతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇక మిగిలింది జనసేన కాబట్టి ఆ పార్టీలోకి వెళ్తారేమోననే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates