‘అమరావతి’ విషయంలో ఏపీ హైకోర్టు తేల్చిన 10 అంశాలివే

కోట్లాది మంది ఏపీ ప్రజలు మాత్రమే కాదు.. దాని సోదర రాష్ట్రమైన తెలంగాణలోని ప్రజలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన అంశంలో ఏపీ హైకోర్టు తాజాగా తీర్పును ఇవ్వటం తెలిసిందే. రాజధానికి సంబంధించి కోర్టు ముందుకు వచ్చిన వ్యాజ్యాల్లో తేల్చాల్సిన పది అంశాలను హైకోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది.
ఈ పది అంశాలకు సంబంధించి ఒక్కో అంశానికి విడివిడిగా ప్రత్యేకంగా వివరణ ఇస్తూ తన నిర్ణయాన్ని వెల్లడించింది. పదిలో తొమ్మిది అంశాలను పిటిషనర్ల వాదనతో ఏకీభవిస్తూ తమ నిర్ణయాన్ని వెల్లడించింది. ఆ అంశాలు ఏమిటన్నది చూస్తే..

1.సీఆర్డీఏ చేసుకున్న అభివృద్ధి ఒప్పందం – తిరగదోడేందుకు వీలు లేని జనరల్‌ పవరాఫ్‌ అటార్నీ ఫారం ‘9.14’కు రాజ్యాంగ బద్ధత ఉందా? ఉంటే… అందులోని  నియమ నిబంధనలను అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా?
ఏపీ హైకోర్టు నిర్ణయం: సీఆర్డీఏతో రైతులు చేసుకున్న ఒప్పందానికి రాజ్యాంగ బద్ధత ఉంది. దానిని ప్రభుత్వం అమలు చేయాలి.

2.అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల చట్టబద్ధ ఆకాంక్షలను రాష్ట్రం దెబ్బతీస్తోందా? అదే నిజమైతే… ఆ చర్యలను చట్ట విరుద్ధమని, ఏకపక్షమని ప్రకటించవచ్చునా?
ఏపీ హైకోర్టు నిర్ణయం:  ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ విరుద్ధమే.

3.  ఏపీ సీఆర్‌డీఏ చట్టంలోని రూల్స్..  ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగర భూసమీకరణ పథకం రూల్స్‌ (2015)లో చేసిన చట్టబద్ధ వాగ్దానాన్ని ఉల్లంఘించేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. ఈ చట్టబద్ధ  హామీలను నిలబెట్టుకునేలా ఆదేశాలు జారీ చేయవచ్చా?
ఏపీ హైకోర్టు నిర్ణయం: అవును.. ఆ విషయాల్లో కోర్టు ఆదేశాల్ని జారీ చేయొచ్చు.

4.అమరావతి రైతులకు రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రసాదించిన జీవించే హక్కును.. ఆస్తులు కాపాడుకునేందుకు 300 (ఏ) అధికరణ ప్రసాదించిన హక్కును రాష్ట్రప్రభుత్వం.. ఏపీ సీఆర్‌డీఏలు తమ చర్యల ద్వారా అతిక్రమించాయా?ఏపీ హైకోర్టు నిర్ణయం: అవును.

5.ఏపీలో పాలించే ప్రభుత్వం మారినంత మాత్రాన విధానం మార్చవచ్చా? ఇదివరకటి ప్రభుత్వం చేపట్టిన రాజధాని ప్రాజెక్టులను కొనసాగించాల్సిన బాధ్యత.. తర్వాత వచ్చిన ప్రభుత్వానికి ఉందా.. లేదా?
ఏపీ హైకోర్టు నిర్ణయం: రాజ్యాంగ వ్యతిరేకమైన.. చట్ట విరుద్ధమైన వాటిని మినహాయించి పాత ప్రభుత్వ విధానాలను కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మార్చకూడదు.

6.అమరావతి రాజధాని ప్రాజెక్టును రాష్ట్రప్రభుత్వం, ఏపీసీఆర్‌డీఏ వదిలేశాయా? మౌలిక వసతులను అభివృద్ధి చేయడంలో అవి ఫెయిల్ అయ్యాయా? అమరావతి రాజధాని కోసం చేపట్టిన భూసమీకరణ పథకం నిబంధనల్లో పేర్కొన్న రైతుల హక్కులను అవి ఉల్లంఘించాయా?
ఏపీ హైకోర్టు నిర్ణయం: అవును.

7. స్థానిక పాలనా సంస్థలు కోరకుండానే.. మాస్టర్ ప్లాన్ ను సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా?
ఏపీ హైకోర్టు నిర్ణయం: ఉండదు

8.రాజ్యాంగంలోని 226వ అధికరణ ప్రకారం హైకోర్టు తన అధికార పరిధిని ఉపయోగించి.. నిరంతరాయంగా కొనసాగేలా రిట్‌ ఆఫ్‌ మాండమస్‌ ను జారీ చేయొచ్చా?
ఏపీ హైకోర్టు నిర్ణయం: జారీ చేయొచ్చు.

9.కేటీ రవీంద్రన్‌ కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు, హైపవర్డ్‌ కమిటీలు సమర్పించిన చట్టబద్ధంగా లేని నివేదికలను చట్టవిరుద్ధం, ఏకపక్షమైనవిగా ప్రకటించవచ్చా?
ఏపీ హైకోర్టు నిర్ణయం:  ఈ నివేదికలను సవాలు చేస్తూ విడిగా కేసులు దాఖలు చేసుకోవచ్చు.

10.ఏపీ రాజధానిని.. రాష్ట్ర హైకోర్టును  ఏపీసీఆర్‌డీఏలోని మూడో సెక్షన్‌లో పేర్కొన్న రాజధాని ప్రాంతంలో గాకుండా.. వేరే ప్రాంతానికి తరలించేలా చట్టం చేసే అధికారం కొత్తగా కొలువు తీరే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఉంటుందా? లేదా?
ఏపీ హైకోర్టు నిర్ణయం: ఆ అధికారం ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు.