పథకాలు ఏవయినా సరే పేర్ల విషయమై రగడ నెలకొంటోంది.గతంలో కూడా పేర్ల విషయమై వివాదం వచ్చింది.కేంద్ర ప్రాయోజిక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా చెప్పుకుంటోందని బీజేపీ ఆరోపించింది.ఆధారాలతో సహా నిరూపించింది కూడా! ప్రధాని ఫొటో కూడా లేకుండా కేంద్ర ప్రాయోజిత పథకాలు అమలు చేయడం ఎంతవరకూ భావ్యం అని ప్రశ్నించింది కూడా! తాజాగా చాలా రోజుల తరువాత ఓ వివాదం రేగింది.పథకాల అమలుపై రేగిన ఈ వివాదం నేపథ్యం ఇలా ఉంది.
ఆంధ్రావనిలో సంక్షేమ పథకాలు అమలులో వైసీపీ సర్కారు అన్ని అవరోధాలూ దాటేందుకు ప్రయత్నిస్తోంది.అప్పులున్నా కూడా సంక్షేమ పథకాల అమలే ధ్యేయమని, మొండి ధైర్యంతో ముందుకువెళ్తోంది. రెండున్నర ఏళ్లలో లక్ష కోట్లకు పైగా నిధులను సంక్షేమానికే వెచ్చించిన ఘనత తమదని వైసీపీ గర్వంగా చెబుతోంది. పథకాల అమలు తీరుపై ప్రశాంత్ కిశోర్ సర్వే కూడా చేశారని అంటున్నారు. కొందరు చిరు వ్యాపారులను,సామాన్యులను కలిసి పీకే టీం ఇప్పటికే మాట్లాడిందని కూడా అంటున్నారు.
ఈ కోవలో జగన్ కు విస్తుబోయే నిజాలు కూడా తెలిశాయని అంటున్నారు.ముఖ్యంగా చాలా మంది సంక్షేమ పథకాల అమలును తప్పు పట్టే విధంగా మాట్లాడారని, రోడ్ల మరమ్మతులు వంటి పనులు వదిలేసి మరీ! డబ్బులు పంచే కార్యక్రమం మానుకోవాలని కొందరు హితవు చెప్పారని కూడా సమాచారం. ముఖ్యంగా నిరుద్యోగ సమస్యను కట్టడి చేస్తేనే ఏ ప్రభుత్వం అయినా సక్సెస్ అయ్యిందని భావించాలి అని పీకే టీం దగ్గర కొందరు చెప్పారని తెలుస్తోంది. వీటి సంగతి ఎలా ఉన్నా కూడా సంక్షేమానికి తాజాగా ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా వెచ్చించారు జగన్.
జగనన్న తోడు పథకానికి సంబంధించి చిరు వ్యాపారులకు అండగా ఉండేందుకు ఒక్కొక్కరికీ పది వేలు చొప్పున 5,10,462 మందికి ఊతం ఇచ్చారు. వడ్డీ లేని రుణం కింద ఈ మొత్తాన్ని జమ చేశామని సీఎం అన్నారు.అదేవిధంగా వడ్డీ భారాన్నీ తామే మోస్తామని చెప్పి అందుకు సంబంధించిన 16.16 కోట్ల రూపాయలను కూడా జమ చేశామని సీఎం తెలిపారు.సకాలంలో రుణాలు చెల్లిస్తే వడ్డీ మాఫీ తప్పక ఉంటుందని దీనిని వినియోగించుకోవాలని కూడా చెప్పారు. రుణాలు చెల్లిస్తే మరోసారి రుణాల వర్తింపునకు అవకాశం ఉంటుందని కూడా వివరించారు.మరోవైపు ఇదే పథకం అమలుపై విమర్శలు రేగుతున్నాయి.వాస్తవానికి ఇది ప్రధాన మంత్రి స్వనిధి యోజన అని,దీనినే పేరు మార్చి అమలు చేస్తున్నారని జనసేన ఆరోపిస్తుంది.కానీ బొత్స మాత్రం కేంద్రం తమనే ఆదర్శంగా తీసుకుంటోందని నిన్నమొన్నటి వేళ చెప్పడం విశేషం. కేంద్రం కేవలం పట్టణాల్లోనే ఈ పథకం తీసుకువస్తే తాము పల్లెలకూ ఈ పథకం అమలును విస్తరింపజేశాం అంటున్నారు.దీనిపై బీజేపీ నేతలు ఇంతవరకూ స్పందించలేదు.