స్వేచ్ఛ‌గా బ్ర‌త‌క‌నివ్వ‌రా? ర‌ఘురామ సూటి ప్ర‌శ్న‌

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును ఏపీ సీఐడీ అధికారులు వెంటాడుతున్నారు. ఆయ‌న‌పై తీవ్ర‌స్థాయిలో నిఘా పెట్టారు. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా.. వెంటాడుతున్నారు. గ‌త నెల సంక్రాంతి స‌మ‌యంలోత‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తాన‌ని చెప్పిన ర‌ఘురామ‌పై వెంట‌నే సీఐడీ పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఆ వెంట‌నే ఆయ‌న‌కు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయ‌న త‌న ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు. అదేస‌మ‌యంలో సీఐడీ ఇచ్చిన నోటీసుల‌పై కోర్టులో కేసు కూడా వేశారు. మ‌రోవైపు అంత‌కు ముందే.. ఏపీ ప్ర‌భుత్వం త‌న‌ను వేధిస్తోందంటూ.. పార్ల‌మెంటు ప్రివిలేజ్ క‌మిటీకి అభ్య‌ర్థ‌న పెట్టుకున్నారు.

అయితే.. ఇవి ఇంకా తేల‌లేదు. దీనికితోడు.. పార్ల‌మెంటు స‌మావేశాలు కూడా ప్రారంభం కావ‌డంతో ర‌ఘురామ ఢిల్లీలోనే ఉండి పోయారు. అయితే.. తాజాగా సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు శాస్త్రి రాసిన నేతాజీ పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంత క‌ర్త‌ల్లో ఒక‌రైన ద‌త్తాత్రేయ ఆహ్వానం మేర‌కు ర‌ఘురామ హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. ఈ విష‌యం తెలిసిన సీఐడీ అధికారులు హైద‌రాబాద్‌లోని ర‌ఘురామ ఇంటి వ‌ద్ద ఎస్ ఐ రామ‌కృష్ణారెడ్డిని నిఘా పెట్టింది. ర‌ఘురామ క‌ద‌లిక‌ల‌పై స‌మాచారం అందించేలా ఆయ‌న అక్క‌డ ఒక బైక్‌పై కూర్చొని ప‌రిశీల‌న చేయ‌డం ప్రారంబించారు.

ఈ విష‌యం తెలిసిన ర‌ఘురామ‌.. త‌న‌ను ఏక్ష‌ణ‌మైనా అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని భావించి.. రామ‌కృష్ణారెడ్డిని గ‌ట్టిగా నిల‌దీయ‌డంతో.. ఆయ‌న విష‌యం చెప్పారు. దీంతో ర‌ఘురామ వెంట‌నే ఢిల్లీకి వెళ్లిపోయారు. ఆయా విష‌యాల‌ను ఆయ‌న మీడియాతో పంచుకున్నారు. అదేస‌మ‌యంలో సెల్పీ వీడియో విడుద‌ల చేశారు. దీనిలో ఆయ‌న మాట్లాడుతూ.. త‌న స్వేచ్ఛ‌కు భంగం క‌లిగిస్తున్నార‌ని.. తాను ఎక్క‌డికి వెళ్లినా.. నిఘా పెడుతున్నార‌ని.. ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇది పెగాస‌స్ క‌న్నా తీవ్ర‌మైన చ‌ర్య అని అన్నారు. తుచ్ఛ‌మైన కొంద‌రు రాజ‌కీయ నేత‌లు చేస్తున్న ఈ దుర్మార్గాన్ని తాను కేంద్రంలోని హోం శాఖ మంత్రికి, ప్ర‌ధాన మంత్రికి లేఖ రూపంలో తెలియ‌జేశాన‌ని చెప్పారు.

ప్ర‌జ‌లు త‌న‌కు అండ‌గా ఉండాల‌ని ర‌ఘురామ విన్న‌వించారు. కోర్టులో కేసు విచార‌ణ‌లో ఉంద‌ని.. అదేవిధంగా పార్ల‌మెంటు ప్రివిలే జ్ క‌మిటీ వ‌ద్ద కూడా విచార‌ణ పెండింగులో ఉంద‌ని.. ర‌ఘురామ తెలిపారు. త‌న‌ను వెంటాడుతున్న సీఐడీపై మ‌రోసారి కోర్టులో కేసు వేస్తాన‌ని తెలిపారు. అదేవిధంగా తెలంగాణ ప‌రిధిలో ఉన్న హైద‌రాబాద్‌కు ఏపీ సీఐడీ అధికారులు ఏవిధంగా వ‌చ్చార‌ని.. తెలంగాణ ప్ర‌భుత్వ స‌హ‌కారం లేకుండా.. ఏపీ పోలీసులు త‌న‌పై నిఘా ఎలా పెడ‌తార‌ని సందేహాలు వ్య‌క్తం చేశారు. ఏదేమైనా.. త‌న‌కు జ‌రుగుతున్న ఈ ఘ‌ట‌న‌ను ప్ర‌జాక్షేత్రంలో తేల్చుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నాన‌ని.. ర‌ఘురామ వెల్ల‌డించారు. దీనికి ప్ర‌జ‌ల స‌హకారం త‌న‌కు కావాల‌ని.. క‌క్ష సాధింపు నేత‌ల‌కు వారే త‌గిన బుద్ధి చెప్పాల‌ని.. పిలుపునిచ్చారు.