ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడంతో ఆయన నిర్వహించిన పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖను ఎవరికిస్తారనే చర్చ రాజకీయవర్గాలలో మొదలైంది. విషాద సమయంలో ఈ చర్చ సరి కానప్పటికీ కీలక మంత్రిత్వ శాఖ కావడంతో వీలైనంత వేగం భర్తీ చేయడం తప్పనిసరి. అయితే, ఎలాగూ జగన్ మంత్రివర్గాన్ని మారుస్తారు కాబట్టి ఆ ప్రక్రియలో భాగంగానే ఇది భర్తీ చేస్తారని తెలుస్తోంది.
అయితే, గౌతమ్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన పదవిని ఎవరికి ఇస్తారనేది వైసీపీలోనూ చర్చనీయాంశంగానే ఉంది. ప్రధానంగా రెండు పేర్లు వినిపిస్తున్నాయి. నగరి ఎమ్మెల్యే రోజా, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. గౌతమ్ రెడ్డి నిర్వహించిన శాఖలోని పరిశ్రమల శాఖను రోజాకు, ఐటీ శాఖను కేతిరెడ్డికి ఇస్తారనే ప్రచారం ఒకటి ఉంది.
అయితే, రోజాకు మంత్రి పదవి ఇవ్వడం అనేది అంత సులభంగా జరగకపోవచ్చనీ సమాచారం. చిత్తూరు జిల్లాలో మరో బలమైన నేతకు మంత్రి పదవి ఇవ్వడానికి అక్కడి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంగీకరించక పోవచ్చని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్ కనుక ఆయన్ను అనునయించగలిగితే రోజాకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంటుంది. లేదంటే, కేతిరెడ్డికే రెండు శాఖలూ దక్కే అవకాశాలున్నాయి.
మరోవైపు శాఖల కేటాయింపులో ఇంకోవాదనా వినిపిస్తోంది. కీలకమైన పరిశ్రమల శాఖ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికే దక్కొచ్చనేదీ వినిపిస్తోంది. ఆర్థిక మంత్రి బుగ్గన పేరు కూడా పరిశ్రమల శాఖ కోసం పరిశీలనలో ఉంది. అదే సమయంలో ఐటీ శాఖ కోసం కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పేరుతో పాటు విడదల రజినీ పేరు కూడా వినిపిస్తోంది. రజనీ ఎన్నారై రిటర్న్. ఆమె సాఫ్ట్ వేర్ రంగం నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. ఆమెకు మంత్రి పదవి ఇవ్వడానికి ఇదో అర్హతగా కనిపిస్తోంది. అయితే, ఊహాగానాలు ఎన్నున్నా సజ్జల సూచన, జగన్ నిర్ణయం మేరకే పదవి కేటాయిస్తారనేది వైసీపీ వర్గాలు చెబుతున్న మాట.
Gulte Telugu Telugu Political and Movie News Updates