జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు చూసిన తర్వాత ఇదే అనుమానం పెరిగిపోతోంది. మత్స్యకార అభ్యున్నతి సభ నరసాపురంలో జరిగింది. బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ మత్స్యకారుల పొట్ట కొట్టే జీవో 217 ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం కనుక జీవోను ఉపసంహరించుకోకపోతే జనసేన అధికారంలోకి వచ్చిన వారంలోనే చట్టాన్ని మార్చేస్తుందన్నారు. పైగా చేపల చెరువుల్లో బడాబాబులు ఎవరు పెట్టుబడులు పెట్టద్దని కూడా వార్నింగ్ ఇచ్చారు.
కోటీశ్వరులకు ఇంకా చిన్న చిన్న చేపల చెరువులతో ఏమిపనంటు నిలదీశారు. తమ ప్రభుత్వం రాగానే కోటీశ్వరులు పెట్టిన పెట్టుబడులను మత్స్యకారుల సొసైటీలకు చెందేట్లు చేస్తుందన్నారు. అప్పుడు తమను జనసేన దెబ్బకొట్టిందని ఏడిస్తే ఉపయోగం లేదన్నారు. అందుకనే తాను ముందుగానే బడాబాబులను హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. మత్స్యాకారులంతా జనసేనకు మద్దతుగా నిలబడాలని, తమకే ఓట్లేయాలని పవన్ విజ్ఞప్తి చేశారు.
తమ పార్టీ అధికారంలోకి రాగానే మత్స్యకారుల కోసం ఏమేమి చేయాలో ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటుందన్నారు. సముద్రం లోతుల్లో ఈదే సామర్థ్యం ఉన్న మత్స్యకారులకు ట్రైనింగ్ ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ పోటీలకు ఎందుకు పంపకూడదంటు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎవరిని కూడా దేహీ అనే అవసరం లేకుండా మత్స్యకారులను జనసేన ప్రభుత్వం తీర్చి దిద్దుతుందని హామీ ఇచ్చారు. జనసేనకు గనుక అసెంబ్లీలో 10 మంది ఎంఎల్ఏలుండుంటే ఇలాంటి చట్టాలను చింపేసే వారమన్నారు.
మొత్తం మీద పవన్ మాటలు విన్న తర్వాత ఎన్నికలు పెట్టడమే ఇక ఆలస్యం తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేయటమే మిగిలిందన్నట్లుగా అనిపించింది. అంటే రాబోయే ఎన్నికల్లో గెలుపుపై పవన్ లో చాలా పెద్ద ఆశలే ఉన్నట్లు అర్ధమవుతోంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకోవటంలో తప్పు లేదు. అయితే అందుకు తగ్గ కార్యాచరణ ఉందా అన్నదే అనుమానం. నియోజకవర్గాల వారీగా అభ్యర్ధుల ఎంపిక, గ్రామస్ధాయిలో పార్టీని బలోపేతం చేయటం, ప్రతి మండలంలోను గట్టి నేతలను రెడీ చేసుకోవటం లాంటి చాలా పనులున్నాయి. ముందు పార్టీని బలోపేతం చేసుకోవటంపై పవన్ దృష్టిపెడితే అధికారం దానంతట అదే వస్తుంది.
ఇప్పటికీ పవన్, నాదెండ్ల తప్ప ఆ పార్టీలో రాష్ట్రం మొత్తం తెలిసిన ఒక అసలు సిసలు రాజకీయ నాయకుడు లేరు. ఎంత కొత్త రాజకీయం చేసినా పార్టీలు నిలబడ్డానికి అవసరమైన బలమైన నేతలు కావాలి. నేటి యువత క్రేజ్ ఉన్న లీడర్లపై ఆకర్షితులు అవుతారు. కాబట్టి పవన్ ఒక్కడా అన్ని చోట్ల అభ్యర్థి కాలేడు. కాబట్టి ముందు ప్రతి నియోజకవర్గంలో కాస్త పేరున్న నేతలను కనిపెట్టాలి. అపుడే జనసేన కలలు గెలుపు వైపు ప్రయాణం మొదలుపెడతాయి.