గత కొద్దికాలంగా కేంద్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఈ క్రమంలో వివిధ విధానాలను తప్పుపడుతున్న సంగతి తెలిసిదే. ఈ క్రమంలోనే విద్యుత్ సంస్కరణలను తప్పుపడుతూ వ్యవసాయ మోటర్లకు మీటర్ల బిగింపును షరతుగా పెడుతున్నారని ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే విద్యుత్ మీటర్లు బిగిస్తున్నారని తెలియజేశారు. కేసీఆర్ కామెంట్లపై ఏపీలోనూ చర్చ జరిగింది. అయితే, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్పందించారు. శ్రీకాకుళంలో వ్యవసాయ సలహా మండలి సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు మనకు అనవసరం అని జిల్లా రైతులకు పిలుపునిచ్చారు!.
వ్యవసాయ బోర్లకు మీటర్లు వలన రైతులకు ఒక్క రూపాయి నష్టం ఉండదని ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతులకు ఇబ్బంది ఉండదు.. ఇది శిలాక్షరాలతో రాసుకోండి అని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నంత వరకూ రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగుతుందని ధర్మాన కృష్ణదాస్ ప్రకటించారు.
ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడానికి రైతులకు అవగాహన లేకపోవడమే కారణంగా తెలిపిన ఆయన.. సరైన వెరైటీ పండించకపోవడం, పంట నూర్పిడి ఆలస్యం కావడం సమస్యగా మారిందన్నారు. మిల్లర్లకు సమయానికి ధాన్యం అందించలేకపోతున్నారని.. ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం అవుతోందని.. రైతుల సమస్యలను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన సమయంలో ఏపీ ప్రస్తావన తేవడం, అది తమను ఇరుకున పడేస్తున్న సమయంలో పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కామెంట్లను లైట్ తీసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ పిలుపునివ్వడం సహజంగానే ఆసక్తికరంగా మారింది. ఏపీ డిప్యూటీ సీఎం కామెంట్లకు గులాబీ దళం ఎలా రియాక్టవుతుందో మరి.