ఏపీ పోలీసు బాస్.. కేబినెట్ హోదా కూడా ఉన్న అత్యున్నత సాయుధ బలగాల అధికారి.. డీజీపీ గౌతం సవాంగ్ అత్యంత దారుణమైన రీతిలో తన పదవి నుంచి బదిలీ అయ్యారు. అయితే.. గౌతం సవాంగ్ బదిలీ వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ.. ఆయన డీజీపీగా వ్యవహరించిన కాలంలో కంటికి కనిపించని నాలుగో సింహంగా ఉన్న పోలీసులు.. తీవ్రస్థాయిలో నగుబాటుకు గురయ్యారనేది వాస్తవం. ఎందుకంటే…. దీనికి రెండు రకాలకారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి రాజకీయం.. రెండు.. అధికారికం. రాజకీయంగా తీసుకుంటే.. సవాంగ్ పూర్తిగా వైసీపీ ప్రభుత్వానికి లోబడి పోయారనే విమర్శలు వచ్చాయి.
ముఖ్యంగా ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయించడంలోనూ.. అర్ధరాత్రి అపరాత్రి లేకుండా.. ఇళ్లకు వెళ్లి దాడులు చేయడంలోనూ.. పోలీసులు అపకీర్తి మూటగట్టుకున్నారు. అంతేకాదు.. రాష్ట్రంలో నలుగురు లాయర్లను పోలీసులు అపహరించి.. తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన హిస్టరీ.. సవాంగ్ హయాంలోనేచోటు చేసుకుంది. చివరకు.. హైకోర్టు జోక్యంతో వారిని బయటకు తీసుకువచ్చారు. ఇక, విశాఖ డాక్టర్.. సుధాకర్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు.. నాలుగో సింహంపై అన్ని వర్గాల నుంచి రాళ్లు రువ్వేలా చేసింది.
చివరకు హైకోర్టు మెట్లు నాలుగు సార్లు ఎక్కిన డీజీపీగా కూడా సవాంగ్ `కీర్తి` దక్కించుకున్నారు. ప్రతి విషయంలోనూ.. పోలీసుల అతి జోక్యం.. డీజీపీ కారణంగానే జరిగిందనే విమర్శలను ఆయన తోసిపుచ్చ లేక పోయారు. చివరకు అమరావతి దళిత రైతులపై.. ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టిన ఘనత కూడా సవాంగ్ ఆధ్వర్యంలోనే జరిగింది. అయితే.. కొన్ని కొన్ని మంచి పనులు ఉన్నప్పటికీ.. అంతిమంగా సిల్వర్ స్క్రీన్ పై..సవాంగ్ స్టోరీలో విలనిజమే ఎక్కువగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. చట్టాన్ని పరిరక్షించాల్సిన డీజీపీ హోదాలో ఉండి.. చట్టాన్ని బొక్కేసే విధంగా వ్యవహరించడం.. అన్ని స్థాయిల్లోనూ విమర్శల పాలైంది.
ఇంతా చేసిన సవాంగ్ సాధించింది ఏమైనా ఉందా? అంటే.. చివరకు ఎలాంటి ప్రాధాన్యంకూడా లేకుండా పోయి.. ఆఖరుకు పోస్టింగు కోసం.. ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ పోస్టింగు ఇవ్వడంలో ఆలస్యమైతే.. జీతంలోనూ కోతపడడం ద్వారా.. ఆయన సాధించింది ఏమిటో ఆయనే తెలుసుకోవాలని.. అంటున్నారు విశ్లేషకులు.