ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ లోటు అంతులేనిదిగా ఉంది అని,అప్పులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయని వార్తలొస్తున్నాయి.ముఖ్యంగా 9 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ చేసిన అప్పు ఐదు వేల కోట్లకుపైగా అని తేలింది.బహుశా! ఈ మొత్తం గత మార్చి నుంచి డిసెంబర్ వరకూ అయి ఉంటుంది.లేదా ఇంకేదయినా లెక్క కావొచ్చు.ఓ తొమ్మిది నెలల కాలం లెక్క తీస్తే జగన్ ప్రభుత్వం చేసిన అప్పు ఇది.ఈ అప్పుకు వడ్డీ ఎంత..ఎంత కాలానికి తిరిగి చెల్లిస్తారు అన్నవి ఇప్పటికీ తేలని ప్రశ్నలుగానే ఉన్నాయి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉండడంతోనే అప్పులు తప్పక తీసుకు రావాల్సి వస్తోందని ప్రభుత్వం చెబుతోంది. కానీ జగన్ ప్రభుత్వం అప్పులు తీసుకురావడంతోనే కాలం వెచ్చిస్తోంది అని యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎప్పటికప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిన్నటి వేళ కూడాపాలనలో లోపాలు ఎత్తి చూపుతూ ఆయన మాట్లాడారు.గతంలో కూడా సంపద సృష్టి కేంద్రాలపై దృష్టి సారించకుండా కేవలం సంక్షేమమే పరమావధి అని అనుకోవడం తప్పు అని కూడా అన్నారు.ఇప్పుడు అప్పుకు ప్రధాన కారణం ఒకటి వెలుగులోకి వచ్చింది.అదే సంక్షేమ ప్రధానంగా ప్రభుత్వం ఉంటూ ఉచిత పథకాలపై ప్రేమ పెంచుకోవడం.రెండు నెలల కాలాన్నిపరిగణనలోకి తీసుకుంటే ఈబీసీ నేస్తం పథకం వర్తింపునకు, జగనన్న చేదోడుకు ఎనిమిది వందల కోట్ల రూపాయలకు పైగా వెచ్చించారు.ఈ విధంగా చూసుకుంటే ప్రతినెలా ఏదో ఒక పథకం పేరిట ఇప్పటిదాకా పెట్టిన ఖర్చుకు లెక్క రెండున్నరేళ్లలో లక్ష కోట్లు అని తేలింది.మరోవైపు కనీస వసతుల కల్పనకు కూడా సర్కారు చర్యలు తీసుకోవడం లేదు.
ముఖ్యంగా రోడ్ల మరమ్మతులకు,ఆస్పత్రుల నిర్వహణకు నిధులు విడుదల లేదు. అదేవిధంగా గ్రామీణ మంచినీటి సరఫరా పథకాలకు ఇప్పటికీ నిధులు లేవు. దీంతో కలుషిత నీరే ప్రజలకు దిక్కవుతోంది. దీంతో చాలా ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలున్నా ప్రభుత్వం మాత్రం సంబంధిత ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలంఅవుతోంది అన్నది క్షేత్ర స్ధాయిలో నెలకొన్న వాస్తవం.పన్నుల రూపేణా ఆదాయం బాగానే ఉన్నా కూడా, కేంద్ర సర్దుబాటులో కొంత సాయం అందుతున్నా కూడా ప్రభుత్వం మాత్రం నిధులను ఏక మొత్తంలో సంక్షేమానికి వెచ్చిస్తోంది.
వీటితో పాటు ప్రకటనలకు వృథా చేస్తోంది.
ఏ విధంగా చూసుకున్నా పత్రికా ప్రకటనలకు ఈ రెండేళ్ల కాలంలో 240 కోట్లకు ప్రచారానికే వెచ్చించారు అని ప్రాథమిక సమాచారం. ఆ రోజు టీడీపీ హయాంలో బాబు డాబు అని విమర్శించిన వారే ఇప్పుడు ఖర్చు అదుపు చేయలేక చేతులెత్తేస్తున్నారు. రాజధాని రియల్ వ్యాపారం అని చెప్పిన వారే ఇప్పుడు అవే భూములను తనఖా పెట్టి అప్పులు తెచ్చుకుని ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇవీ టీడీపీ చెబుతున్న విమర్శలు. వీటిపై వైసీపీ ఏం చెప్పినా కూడా గణాంకాలే ప్రామాణికం కావాలి.
ఆఖరుగా వ్యయ నియంత్రణ లేకపోవడం. సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యం. సంపద సృష్టి కేంద్రాలపై దృష్టి లేకపోవడం.
ఆదాయం ఉన్నా అప్పుల కారణంగా ఆశాజనక వృద్ధి ఆంధ్రాలో ప్రధాన సమస్యగా ఉండడం.. ఇవన్నీ ఇప్పటి ప్రగతి నిరోధకాలు.