లాక్ డౌన్ పుకార్లపై స్పందించిన కేంద్రం.. ఏమందంటే?

Lockdown

అంతకంతకూ పెరుగుతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా త్వరలో లాక్ డౌన్ విధించటం ఖాయమన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. గడిచిన మూడు రోజులుగా వినిపిస్తున్న ఈ మాట గ్రామీణ స్థాయికి వెళ్లిపోయింది.

దీంతో.. మళ్లీ లాక్ డౌన్ అయితే ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత అనుభవాలతో.. మూడు రోజులుగా సూపర్ మార్కెట్లలో రద్దీ పెరిగింది.

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నిత్యవసర వస్తువుల్ని భారీగా కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో.. కిరాణా.. సూపర్ మార్కెట్ల వద్ద రద్దీ నెలకొంది. తాజా లాక్ డౌన్ ఊహాగానాలపై రాష్ట్రాలు కానీ.. కేంద్రం కాని స్పందించకపోవటంతో.. ఈ వాదన మరింత జోరందుకుంది. ఎట్టకేలకు తాజాగా ఈ అంశంపై కేంద్రం స్పందించింది. మరోసారి లాక్ డౌన్ విధించే ఆలోచనలో కేంద్రం లేదని స్పష్టం చేసింది.

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదని తేల్చింది. వదంతుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. లాక్ డౌన్ ను సంపూర్ణ లాక్ డౌన్ కిందకు మార్చే ఆలోచన ప్రస్తుతం కేంద్రానికి లేదన్న కేంద్రం.. ఇలాంటివి నమ్మవద్దని కోరింది. సో.. మరోసారి దేశ వ్యాప్తంగా సంపూర్ణ లాక్ డౌన్ విదిస్తున్నారన్న మాట ఉత్త మాటగా చెప్పక తప్పదు.