ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టి అయిదు రాష్ట్రాల ఎన్నికలపై ఉంది. ముఖ్యంగా దేశ రాజకీయాల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే అక్కడ తొలి దశ పోలింగ్ కూడా పూర్తయింది. అధికారం నిలబెట్టుకోవడం కోసం బీజేపీ, గద్దెనెక్కడం కోసం కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ హోరాహోరీగా పోరాడుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో పార్టీల విజయ సమీకరణాలు మార్చేంతలా చిన్నపార్టీలు ప్రభావం చూపే అవకాశం ఉంది. చిన్న పార్టీలే కదా అని తేలిగ్గా తీసేయడానికి వీల్లేదు. అవే చివరకు కొంప ముంచుతాయని విశ్లేషకులు అంటున్నారు.
ఆ సమీకరణాలతో..
యూపీలో కుల మతాల సమీకరణాలే ప్రధాన కారణాలుగా చిన్ని పార్టీలు పుట్టుకొచ్చాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా ఎంబీసీల నుంచి పటు చిన్న పార్టీలు ఆవిర్భవించాయి. ముఖ్యంగా 1989 నుంచి రాష్ట్రంలో చిన్న, మధ్యస్థాయి పార్టీల సంఖ్య వేగంగా పెరుగుతూ వచ్చింది. 1991 అసెంబ్లీ ఎన్నికల నుంచి ఆయా పార్టీలకు వస్తున్న ఓట్ల శాతంలోనూ గణనీయ పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ అప్నాదళ్ (ఎస్), నిషాద్ పార్టీ, ఎస్‌బీఎస్‌పీలు చిన్నపార్టీల్లో ప్రముఖమైనవిగా కనిపిస్తున్నాయి.
పొత్తు అనివార్యం..
రాష్ట్రంలో అధికారం కోసం పోరాడే ప్రధాన పార్టీలు ఈ చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకోవడం అనివార్యంగా మారింది. ఆయా సామాజిక వర్గాల్లో ఈ చిన్న పార్టీలు చూపించే ప్రభావమే అందుకు కారణం. 2017 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అప్నాదళ్, సుహెల్‌దేవ్ రాజ్‌భర్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బీఎస్‌పీ)లతో పొత్తు బీజేపీకి బాగా కలిసొచ్చింది. ప్రధానంగా ఎంబీసీల ఓట్లను పొందడంలో ఆ రెండు పార్టీలు బీజేపీకి అండగా నిలిచాయి. కానీ ఈ ఎన్నికల నాటికి పరిస్థితులు మారిపోయాయి. ఎస్‌బీఎస్‌పీ పార్టీ సమాజ్‌వాదీ పార్టీ కూటమిలో చేరింది. అప్నాదళ్‌లోని ఓ చీలికవర్గంతో పాటు మరికొన్ని చిన్నపార్టీలతో కలిసి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చేతులు కలిపారు.
గత ఎన్నికల్లో ఫలితాల ఆధారంగా అఖిలేష్ ఇలా చిన్న పార్టీలకు ప్రాధాన్యత ఇచ్చారని విశ్లేషకులు అంటున్నారు. ఈ సారి బీజేపీ.. నిషాద్ పార్టీ, అప్నాదళ్‌తో కలిసి ఎన్నికలకు సిద్ధమైంది. ఆ చిన్న పార్టీల గుర్తులపై బీజేపీ అభ్యర్థులు పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే వాటికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో అర్థమవుతోంది. గత ఎన్నికల్లో దాదాపు 289 చిన్న పార్టీలు పోటీ చేశాయని సమాచారం.