మార్చిలో టిమ్స్ (తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ) గురించి కేసీఆర్ ప్రకటించినపుడు అందరి స్పందన ఒకటే. కేసీఆర్ సంక్షోభాలను సవాళ్లుగా స్వీకరించారు, మంచి పని చేశారు అని అభినందించారు. కట్ చేస్తే సరిగ్గా వారం క్రితం గాంధీ ఆస్పత్రి సరిపోవడం లేదని… నిమ్స్ ను కూడా కోవిడ్ చికిత్స కోసం సిద్ధం చేయడానికి ఆదేశాలు జారీ చేశారు. సరిగ్గా ఈ వార్త చదివిన అందరికీ ఒక అనుమానం వచ్చింది… టిమ్స్ ఏమైంది? అని. దానికి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఈరోజు సమాధానం చెప్పారు.
టిమ్స్ ప్రకటన చేసి నేటికి 75 రోజులట. సరే ఎలా ఉందో చూద్దాం అని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. అక్కడ ఆశ్చర్యకరమైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. నలుగురు సెక్యూరిటీ తప్ప అక్కడ ఎవరూ లేరని తేలింది. మొత్తం ఆస్పత్రి లోపలి పరిసరాలను వీడియో తీసి మీడియాకు విడుదల చేశారు రేవంత్ రెడ్డి.100 మంది డాక్టర్లు, ప్రపంచ అత్యాధునిక వైద్యం అని కేసీఆర్ ఘనంగా ప్రకటించిన టిమ్స్ ఏమైందని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన ఉండదు అని చెప్పడానికి టిమ్స్ ప్రత్యక్ష ఉదాహరణ అని…రేవంత్ రెడ్డి విమర్శించారు.దేశంలో ప్రతి రాష్ట్రం లక్షల్లో టెస్టులు చేస్తుంటే.. తెలంగాణలో ఇప్పటి వరకు 50వేల టెస్టులు కూడా చేయలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. పక్కనున్న ఏపీలో ఐదున్నర లక్షల టెస్టులు చేశారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో టెస్టుల పరంగా తెలంగాణ స్థానం 22వ స్థానంలో ఉండటం కేసీఆర్ వైఫల్యానికి నిదర్శనం అని రేవంత్ ఆరోపించారు.
ఉద్యోగులకు సగం జీతాలు ఎగ్గొట్టారు. కేంద్రం కొంత సాయం చేసింది. కోట్లలో విరాళాలు వచ్చాయి. అవన్నీ ఏం చేశారని రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశానికే తలమానికం అని మీరు ఘనంగా చెప్పిన టిమ్స్ లో ఇంకా డ్రైనేజీ కూడా రెడీ చేయలేకపోయారని… పక్కనున్న జాతీయ విశ్వవిద్యాలయంలోకి టిమ్స్ డ్రైనేజీ పారుతోందని అన్నారు.
వారి బాధ చూడలేక తాను 50 లక్షలు మంజూరు చేసినా ఆ పనులు కూడా చేయలేదని విమర్శించారు. కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్పిన రేవంత్ ప్రతి రోజు 40-50 మరణాలను దాచిపెడుతున్నారని సంచలన ఆరోపణ చేశారు.