ప్రధాని నరేంద్ర మోడీ చాన్నాళ్ల తర్వాత తెలుగు గడ్డపై అడుగు పెట్టారు. రామానుజాచార్యుల వెయ్యో జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ శివార్లలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని తన చేతుల మీదుగా ఆవిష్కరించారు భారత ప్రధాని. ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో తెలుగు సినిమా గురించి ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు వారి కీర్తిని కొనియాడుతూ.. ఆయన తెలుగు సినిమాల ప్రస్తావన తీసుకొచ్చారు.
తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించిందని… తెలుగు సినిమా విశ్వవ్యాప్తమైందని కొనియాడారు. తెలుగు సినిమా సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతాలు సృష్టిస్తోందని.. సిల్వర్ స్క్రీన్ నుంచి ఓటీటీ వరకు తెలుగు సినిమాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోందని అన్నారు మోడీ. అలాగే తెలుగు భాష మీదా ఆయన ప్రశంసలు కురిపించారు.
తెలుగు భాషా చరిత్ర ఎంతో సుసంపన్నమైందని వ్యాఖ్యానించారు. కాకతీయుల రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం గర్వకారణమని, పోచంపల్లి చేనేత వస్రాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయని అన్నారు. తెలుగు సినిమాల గురించి మోడీ ప్రస్తావించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హరీష్ శంకర్ సహా టాలీవుడ్ ప్రముఖులు చాలామంది ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
బాహుబలి సినిమా దగ్గర్నుంచి తెలుగు సినిమాల గురించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ మధ్య పుష్ప సినిమాతో మన సినిమాలకున్న గుర్తింపు ఇంకా పెరిగింది. ఈ చిత్రం నార్త్ ఇండియాలో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలన్నింటికీ ఉత్తరాదిన మంచి గుర్తింపు దక్కుతోంది. ఈ నేపథ్యంలోనే జనాల నాడిని పట్టిన మోడీ.. తెలుగు సినిమాల గురించి తన ప్రసంగంలో ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్షించారు.