జనసేన అధినేత పవన్ కల్యాణ్ పూర్తిగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారా? రాష్ట్రంలో ఏ పరిణామం జరిగినా వెంటనే స్పందించే ఆయన ఇప్పుడు మౌన దీక్ష చేస్తున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి, ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల పరంగా, ప్రజా సమస్యల పరంగా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నప్పటికీ పవన్ మాత్రం నోరు మెదపడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చాననే చెప్పుకునే ఆయన ఇప్పుడు ప్రశ్నించేందుకు ఎందుకు ముందుకు రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదో ఆవేశం వచ్చినప్పుడు మాత్రం పవన్ ప్రజల్లోకి వచ్చి ఏవో నాలుగు మాటలు అనేసి వెళ్లిపోతారని ఇప్పటికే ఆయనపై విమర్శలున్నాయి. ఇప్పుడు ఆయన వ్యవహార శైలి కూడా దాన్ని బలపరిచేదిగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇటీవల గుడివాడలో కొడాలి నాని క్యాసినో వ్యవహారం ఏపీ రాజకీయాలను ఓ ఊపు ఊపింది. సంక్రాంతి సందర్భంగా వైసీపీ మంత్రి నాని తన కన్వెన్షన్ సెంటర్లో క్యాసినో నిర్వహించారని రూ.వందల కోట్లు సంపాదించారని టీడీపీ ఆరోపణలు చేసింది. బీజేపీ కూడా ఈ విషయంపై రాద్ధాంతం చేసింది. కానీ పవన్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
ఇక ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన పీఆర్సీపై ఆగ్రహంతో ఉన్న ఉద్యోగులు సమ్మెకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల ఆరు అర్ధరాత్రి నుంచి సమ్మె చేస్తామని నోటీస్ కూడా ఇచ్చారు. తమకు ఏ రాజకీయ పార్టీల అండ అవసరం లేదని ఉద్యోగులు చెబుతున్నప్పటికీ పార్టీలు మాత్రం వాళ్లకు మద్దతు ప్రకటించాయి. కానీ దీనిపై కూడా పవన్ నేరుగా స్పందించనే లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. లక్షలాది మంది ఉద్యోగులు, పింఛనుదారులకు ఆయన సంఘీభావం ప్రకటించలేదు.
తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వ నిర్ణయంతో కొన్ని చోట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొత్త కొత్త డిమాండ్లు వినిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ప్రజలు అసంతృప్తితో రోడ్లపైకి వచ్చారు. మదనపల్లె, హిందూపురం, రాజంపేట, చీరాల, నరసాపురం లాంటి ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. దీనిపై కూడా పనవ్ సైలెంట్‌గానే ఉన్నారు. విజయవాడ బాలిక మృతిపై కూడా స్పందించలేదు. కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా ఉందని, తెలుగు రాష్ట్రాల ప్రస్తావన లేకపోవడం ఒక్కటే నిరాశ కలిగించిందని తాజాగా ఆయన ఓ పోస్టు పెట్టారు. అంతే కానీ ఏపీలో సమస్యలపై మాత్రం పోరాడడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తన కొత్త సినిమా భీమ్లా నాయక్ విడుదలకు సిద్ధంగా ఉండడంతోనే లేని పోని గొడవల జోలికి వెళ్లొద్దని పవన్ భావిస్తున్నారని మరో వర్గం చెబుతోంది. ఆయన తన స్వార్థం చూసుకుంటున్నారని, ఇక ఆయనకు రాజకీయాలు ప్రజల సమస్యలు ఎందుకని విమర్శలు వస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates