కరోనాను జయించిన నాలుగు నెలల పాప

కరోనా మహమ్మారికి జాలి దయ అని ఏమీ లేదు. అప్పుడే పుట్టిన చిన్నారి నుంచి పండు ముసలి వరకు అందరినీ కబళిస్తోంది. పిల్లలు, పెద్ద వాళ్ల మీదే తీవ్ర ప్రభావం చూపుతోంది. వారి ప్రాణాలను బలిపెడుతోంది. పెద్దవాళ్లెవరైనా ఏదైనా అనారోగ్య సమస్యలు ఉండి కరోనా సోకితే అంతే సంగతులు. వారి ప్రాణం మీదికి వస్తోంది. అలాగే చిన్న పిల్లలకు కరోనా సోకినా వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. పిల్లలు, ముసలి వాళ్లకు రోగ నిరోధక శక్తి తక్కువ కావడంతో కరోనా వేగంగా దాడి చేస్తోంది.

ఈ నేపథ్యంలో కేవలం నాలుగు నెలల వయసున్న పాపకు కరోనా సోకడంతో ఆ చిన్నారిని ఎలా కాపాడుకుంటామో తెలియక అల్లాడిపోయారు తల్లిదండ్రులు. కానీ ఆ చిన్నారికి అత్యుత్తమ చికిత్స అందడంతో ప్రాణాలతో బయటపడింది. కరోనాను జయించి తల్లిదండ్రుల వద్దకు చేరింది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో చోటు చేసుకున్న ఉదంతం.

తూర్పుగోదావరి జిల్లా మహిళ ఒకావిడకు కరోనా సోకింది. తర్వాత కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు చేయగా.. నాలుగు నెలల వయసున్న ఆమె పాపకు కూడా కరోనా ఉన్నట్లు తేలింది. ఈ పాపను విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించి 18 రోజుల పాటు చికిత్స అందించారు. డాక్టర్లు ఈ పాప కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

18 రోజుల పాటు ఆ చిన్నారిని వెంటిలేటర్ మీదే పెట్టి చికిత్స అందించడంతో ముప్పు తొలగింది. తాజాగా పరీక్షలు చేసి చూడగా పాపలో కరోనా లక్షణాలు లేవని తేలింది. పాపను హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేశారు. ఈ విషయాన్ని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ప్రెస్ మీట్ పెట్టి మరీ మీడియాకు తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నివారణ చర్యలు, చికిత్స విషయంలో మొదట విమర్శలు వచ్చాయి కానీ.. ఇప్పుడు ఏపీని అందరూ అభినందిస్తున్నారు. దేశంలోనే అత్యధికంగా టెస్టులు చేయడమే కాక.. కరోనా చికిత్స విషయంలో ఏపీ అప్రమత్తంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఈ ఉదంతం తాజా ఉదాహరణ.