మరోసారి బీజేపీ చీఫ్ సోమువీర్రాజు క్షమాపణలు చెప్పారు. ముందు నోరుపారేసుకోవటం తర్వాత క్షమాపణలు చెప్పటం వీర్రాజుకు బాగా అలవాటైపోయింది. ఇపుడు వీర్రాజు ఎందుకు క్షమాపణలు చెప్పారు ? ఎందుకంటే ప్రాణాలు తీసేవారికి ఎయిర్ పోర్టు ఎందుకు ? అంటు వీర్రాజు వ్యాఖ్యలు చేశారు. వాళ్ళకు ప్రాణాలు తీయటం మాత్రమే వచ్చు. అంటు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.
వీర్రాజు చేసిన కామెంట్లపై వైసీపీ నుండే కాకుండా వామపక్షాల నేతలు, ప్రజాసంఘాల నుండి కూడా తీవ్రస్ధాయిలో వ్యతిరేకత వస్తోంది. దీంతో జరిగిన డ్యామేజీని ఆలస్యంగా గుర్తించిన వీర్రాజు ముందు తన వ్యాఖ్యలను మీడియా, ప్రతిపక్షాలు వక్రీకరిస్తున్నాయంటు మండిపడ్డారు. అయితే ఆయన మాట్లాడిన మాటల వీడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దాంతో బుకాయించటం కష్టమని అర్ధమైపోయి, ఇక లాభం లేదని చివరకు రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పుకున్నారు.
తన వ్యాఖ్యలతో బాధపడిన రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నట్లు వీర్రాజు ప్రకటించారు. పైగా కడపలో ఎయిర్ పోర్టు నరేంద్రమోడి ఏర్పాటు చేసిందంటు అబద్ధాలు చెప్పారు. కడపలో ఎయిర్ పోర్టు దశాబ్దాలుగా ఉన్న విషయం కూడా వీర్రాజుకు తెలీకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఆ మధ్య చీఫ్ లిక్కర్ పై మాట్లాడుతు తాము అధికారంలోకి వస్తే చీపులిక్కర్ రు. 50 కే అందిస్తామన్నారు. కాబట్టి రాష్ట్రంలోని కోటిమంది తాగుబోతులు తమపార్టీకే ఓట్లేయాలని పిలుపుకూడా ఇచ్చారు.
చీపులిక్కర్ ధరలపై వీర్రాజు చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారాన్నే రేపాయి. దాంతో ముందు తన మాటలను వక్రీకరించారని అన్నా చివరకు ప్రజలకు క్షమాపణలు చెప్పుకున్నారు. అంటే ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే నోటికొచ్చింది ఏదోకటి మాట్లాడేస్తున్నారని. వెనకా ముందు చూసుకోకుండా మాట్లాడేయటం తర్వాత వివాదమైతే తీరిగ్గా క్షమాపణలు చెప్పుకోవటం వీర్రాజుకు అలవాటుగా మారిపోతోంది. సీనియర్ నేతైన వీర్రాజు కాస్త సంయమనం పాటిస్తే పదే పదే క్షమాపణలు చెప్పాల్సిన అవసరమే ఉండదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates