రేవంత్‌రెడ్డిపై కొండా సురేఖ గుస్సా..!

టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కినుక వ‌హించిన‌ట్లు తెలుస్తోంది. కొండా కుటుంబానికి.. రేవంత్ కు మ‌ధ్య కొన్నాళ్లుగా దూరం పెరిగింద‌ని పార్టీ వ‌ర్గాల స‌మాచారం. ప‌ర‌కాల‌లో ఇటీవ‌ల చోటుచేసుకున్న ఒక సంఘ‌ట‌న వ‌ల్ల అధిష్ఠానంపై సురేఖ ఆగ్ర‌హంగా ఉన్నార‌ని.. పార్టీ త‌ర‌పున త‌మ‌కు అండ ల‌భించ‌లేద‌ని అల‌క వ‌హించిన‌ట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆత్మకూరు లో కొండా మురళి తల్లిదండ్రుల విగ్ర‌హాల‌ను కొన్ని రోజుల‌ క్రితం టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు ధ్వంసం చేసేందుకు ప్ర‌య‌త్నించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. కాంగ్రెస్ శ్రేణులు.. కొండా దంప‌తులు స‌మాధుల వ‌ద్ద‌కు చేరుకుని ప‌ర‌కాల ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఎమ్మెల్యే కూడా ప్ర‌తి విమ‌ర్శ‌లు చేశారు. సురేఖ పై వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌లు కూడా చేశారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర ఉత్కంఠ‌ నెల‌కొంది. అయితే.. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై కాంగ్రెస్ అధిష్ఠానం కానీ.. పార్టీ అధ్య‌క్షుడు రేవంత్ కానీ త‌న‌ను ప‌రామ‌ర్శించ‌లేద‌ని.. పార్టీ త‌ర‌పున త‌న‌కు స‌రైన మ‌ద్ద‌తు దొర‌క‌లేద‌నే భావ‌న‌లో సురేఖ ఉన్నారు. అయితే సురేఖ‌కు.. రేవంత్ కు ఇటీవ‌ల దూరం బాగా పెరిగింద‌ని పార్టీ శ్రేణులు అనుమానిస్తున్నాయి. ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక స‌మ‌యంలో రేవంత్ ప్ర‌వ‌ర్తించిన తీరు త‌న‌ను బాధించింద‌నే భావ‌న‌లో కొండా దంప‌తులు ఉన్నార‌ని స‌మాచారం.

అయితే.. కొండా దంప‌తులే హుజూరాబాద్ విష‌యంలో స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేద‌ని రేవంత్ అనుచ‌రులు ఆరోపిస్తున్నారు. ఇక్క‌డ పోటీ చేస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు వ‌రంగ‌ల్ తూర్పు, భూపాల‌ప‌ల్లి, హుజూరాబాద్ టికెట్లపై హామీ అడిగార‌ని.. అది సాధ్య‌మ‌య్యే ప‌ని కాద‌ని.. ఏదో ఒక చోటే టికెట్ కేటాయిస్తామ‌ని రేవంత్ చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. దీంతో కొండా దంప‌తులు హుజూరాబాద్ లో పోటీకి నిరాక‌రించార‌ట‌. అప్ప‌టి నుంచి రేవంత్ కు.. కొండా దంప‌తుల‌కు దూరం పెరిగింద‌ట‌.రేవంత్ పీసీసీ అధ్య‌క్షుడు అయితే.. త‌న‌కు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి ఇప్పిస్తాన‌ని హామీ ఇచ్చార‌ని.. అది కూడా నెర‌వేర‌క‌పోవ‌డంతో కినుక వ‌హించార‌ట‌.

రేవంత్ కు అధ్య‌క్ష ప‌ద‌వి రాక‌ముందు క‌ల్వ‌కుర్తి నుంచి హైద‌రాబాద్ వ‌ర‌కు పాద‌యాత్ర నిర్వ‌హించారు. దీనికి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. పాద‌యాత్ర ముగింపు స‌భ‌లో రేవంత్ ను కొనియాడారు సురేఖ‌. వైఎస్ త‌ర్వాత సీఎం అయ్యే అర్హ‌త రేవంత్ కు మాత్ర‌మే ఉంద‌ని ఆ స‌భ‌లో ప్రశంసించారు. అప్ప‌టి నుంచి వీరి మ‌ధ్య స‌త్సంబంధాలు బాగానే న‌డిచాయ్‌. అధ్య‌క్ష ప‌ద‌వి వ‌చ్చిన‌పుడు సురేఖ ఇంటికి కూడా వెళ్లారు రేవంత్‌. కానీ, త‌ర్వాత ప‌రిణామాల వ‌ల్లే దూరం పెరిగింద‌ట‌. భ‌విష్య‌త్ లో ఈ దూరం ఇలాగే కొన‌సాగుతుందా..? మ‌న‌స్ప‌ర్థ‌లు వీడి క‌లిసి ప‌ని చేస్తారా..? అనేది వేచి చూడాలి.