సొంత గూటికి కేసీఆర్?

సీఎం కేసీఆర్ త‌న సొంత గూటికి వెళ్ల‌నున్నారా..? గ‌త రెండు ప‌ర్యాయాలు గ‌జ్వేల్ నుంచి గెలిచి ముఖ్య‌మంత్రి అయిన కేసీఆర్ త‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని వీడ‌నున్నారా..? టీడీపీలో ఉన్న‌ప్పుడు ఇర‌వై సంవ‌త్స‌రాలుగా గెలిచిన త‌న సొంత అసెంబ్లీ స్థానం సిద్దిపేట‌కు మార‌నున్నారా..? ఇటీవ‌ల జ‌రిగిన త‌న ఆంత‌రంగికుల భేటీలో ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశారా? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నారు పార్టీ శ్రేణులు.  నంద‌మూరి తార‌క‌రామారావు పార్టీ ప్రారంభించిన స‌మ‌యంలో టీడీపీలో చేరిన కేసీఆర్ 1985 నుంచి 2004 వ‌ర‌కు సిద్దిపేట లో వ‌రుస‌గా ఐదు ప‌ర్యాయాలు విజ‌యం సాధించారు. చంద్ర‌బాబు హ‌యాంలో మంత్రి ప‌ద‌వి రాక‌పోవ‌డంతో 2001లో పార్టీకి రాజీనామా చేసి ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మాన్ని కొన‌సాగించారు. 

తెలంగాణ రాష్ట్ర స‌మితి పేరుతో ప్ర‌త్యేక పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ స‌మాజాన్ని ఏకం చేశారు. 2001 ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ త‌ర‌పున విజ‌యం సాధించిన కేసీఆర్ 2004లో కూడా తిరిగి గెలిచారు. ఉద్య‌మం తీవ్ర‌త‌రం కావ‌డంతో ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి త‌న స్థానంలో త‌న అల్లుడు హ‌రీశ్ రావును పోటీ చేయించి గెలిపించుకున్నారు. 2009లో మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఎంపీగా గెలిచిన కేసీఆర్ త‌న ప్ర‌త్యేక తెలంగాణ క‌ల నెర‌వేర‌డంతో 2014లో గ‌జ్వేల్ నుంచి గెలిచి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టారు. 2018లో కూడా తిరిగి గెలిచి మ‌రోసారి ముఖ్య‌మంత్రిగా కొన‌సాగుతున్నారు.

ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో కేసీఆర్ త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన సిద్దిపేట నుంచే బ‌రిలో ఉండ‌డం ఉత్త‌మ‌మ‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. గ‌జ్వేల్ నుంచి వంటేరు ప్ర‌తాప రెడ్డికి అవ‌కాశం ఇవ్వాల‌నే ఆలోచ‌న ఉన్న‌ట్లు అనుచ‌రుల వ‌ద్ద ప్ర‌స్తావించిన‌ట్లు తెలిసింది. త‌న మామ త్యాగం చేసిన సిద్దిపేట నుంచి దాదాపు ఇర‌వై ఏళ్లు ఎమ్మెల్యే గా గెలిచి ప‌లు మంత్రి ప‌ద‌వులు నిర్వ‌హించిన హ‌రీశ్ ను ఈసారి పార్ల‌మెంటుకు పంపాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

మెద‌క్ ఎంపీగా హ‌రీశ్ ను పోటీ చేయించాల‌ని కేసీఆర్ ఆలోచ‌న‌గా తెలుస్తోంది. దీని వ‌ల్ల రెండు ప్ర‌యోజ‌నాలు ఆశిస్తున్న‌ట్లు స‌మాచారం. త‌న కుమారుడు కేటీఆర్ సీఎం ప‌ద‌వి చేప‌ట్టేందుకు ముప్పుగా ఉన్న ఒక్కొక్క‌రిని సెట్ చేస్తున్న కేసీఆర్.. ఇపుడు హ‌రీశ్ ను కూడా రాష్ట్ర రాజ‌కీయాల‌కు దూరం పెట్టాల‌ని అనుకుంటున్నార‌ట‌. క‌విత‌కు ఎమ్మెల్సీ.., సంతోష్ కు రాజ్య‌స‌భ ఇచ్చి సంతోష‌ప‌రిచిన కేసీఆర్ ఈటెల‌ను ఏకంగా పార్టీ నుంచి పంపేశారు. ఇపుడు హ‌రీశ్ ను కేంద్రానికి పంపి కేటీఆర్ కు మార్గం సుగ‌మం చేయాల‌ని భావ‌న‌లో ఉన్నార‌ట‌. చూడాలి మ‌రి భ‌విష్య‌త్ రాజ‌కీయాలు ఎలా ఉంటాయో..?