62కు సర్వీసు పొడిగింపు వదులుకుంటారా ?

ఉద్యోగులకు ప్రభుత్వం పొడిగించిన రిటైర్మెంట్ వయసు ఉద్యోగులు వద్దంటున్నారా ? ఉద్యోగ సంఘాల నేతలు చేస్తున్న వాదన చూస్తుంటే సర్వీసు పొడిగింపును వదులుకున్నట్లే కనబడుతున్నది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2 ఏళ్ళు పెంచింది. అంటే ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు ప్రస్తుతం 62 సంవత్సరాలన్నమాట.

ఇదే విషయమై ఉద్యోగ నేతలు మాట్లాడుతూ సర్వీసు పరిమితిని పెంచమని తాము ప్రభుత్వాన్ని అడగలేదు కదా అంటున్నారు. ఉద్యోగి రిటైర్ అయినపుడు ఇవ్వాల్సిన అనేక బెనిఫిట్స్ లక్షల్లో ఉంటుందన్నారు. అంత డబ్బు ప్రభుత్వం దగ్గర లేదు కాబట్టే రిటైర్మెంట్ వయసును పెంచిందని నేతలంటున్నారు. నేతల వాదనలో ఎలాంటి తప్పు లేదు.  జగన్ ప్రభుత్వం   ఈ కారణంగానే ఉద్యోగల రిటైర్మెంట్ వయసును   పెంచారు. ఇపుడు  ఆ విషయాన్ని దాచిపెట్టడం లేదు.

ప్రభుత్వం ఆర్థిక సమస్యల్లో ఉందనే మొదటి నుంచి చెబుతున్నారు. రాష్ట్ర విభజన, కరోనా వైరస్, కేంద్రం నుంచి అందాల్సిన సాయం అందకపోవటం లాంటి కారణాలతో రాష్ట్ర ఆదాయం పెరగాల్సినంతంగా పెరగలేదనే మొదటి నుంచి ప్రభుత్వం చెబుతున్నది. ఉద్యోగులను తాను ఉద్దరించేస్తున్నట్లు ప్రభుత్వం ఎప్పుడు చెప్పలేదు. రిటైర్మెంట్ వయసు పెంపు ఇష్టం లేకపోతే అదే విషయాన్ని ఉద్యోగ నేతలు ప్రభుత్వానికి రాతమూలకంగా చెప్పేయచ్చు.

అలాగే జగనన్న గృహ నిర్మాణ పథకంలో తమకు ఏదో మేలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పటం కూడా తప్పంటున్నారు ఉద్యోగ నేతలు. అది రియల్ ఎస్టేట్ పథకమే కానీ తమను ఉద్ధరించటానికి చేస్తున్నదేమీ లేదన్నారు. ఇది కూడా నిజమే. కాకపోతే ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి టౌన్ షిప్పు స్ధలాల్లో 10 శాతం రిజర్వేషన్+స్ధలం ధరలో 20 శాతం రాయితి ఇస్తామని ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది. టౌన్ షిప్పులు ఏర్పాటు చేసే ప్రాంతాల్లోని రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం ధరలు నిర్ణయించింది. దీన్ని ఉద్యోగ నేతలు తప్పుపడుతున్నారు.

దాన్ని ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపారమే అని చెబుతున్న నేతలు ఆ వెసులుబాటు తమకు అవసరం లేదని తిరస్కరించచ్చు. ప్రభుత్వం ఆపర్ చేసిన ప్రతిదీ తీసుకోవాలని రూలేమీ లేదు. ఇష్టముంటే తీసుకోవచ్చు లేదా తిరస్కరించే హక్కు ఉద్యోగులకు ఉంటుంది. ఉద్యోగ నేతల మాటలు చూస్తుంటే సర్వీసు పొడిగింపు, స్థలాలు తమకు అవసరం లేదన్న నిర్ణయానికి వచ్చినట్లే ఉన్నారు. రాత మూలకంగా దాన్ని ప్రభుత్వానికి తెలియజేయటమే ఆలస్యం.