సటైర్లు వేయడంలో తనకు తానే సాటి అనిపించుకునే ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.. తాజాగా ఏపీ సీఎం జగన్‌పై తన స్టయిల్లో సటైర్లు వేసి నవ్వించేశారు. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్.. జిల్లాకో విమానాశ్రయం కడతామంటూ.. వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. శుక్రవారం జరిగిన కేబినెట్‌లో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే.. ఈ కామెంట్లపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. జిల్లాకో.. వైద్యశాల అన్నారు..అదేమైంది.. ఇప్పుడు విమానాశ్రయాలా? అంటూవారు ప్రశ్నిస్తున్నారు.
ఈ క్రమంలోనేమాజీ మంత్రి అయ్యన్న కూడా సీఎం జగన్ ను ఉద్దేశించి సటైర్లు పేల్చారు. ‘‘అమ్మా.. భారతమ్మా.. ఈ తుగ్లక్ నిర్ణయాలన్నీ చూస్తుంటే మీకు ఎలా ఉందో తెలియదు గాని, మాకైతే మీ ఆయనకి ఏదో అయిందనే అనుమానంగా ఉంది. ఎందుకైనా మంచిది ఒకసారి హైదరాబాద్‌లో గాని, విశాఖప్నటంలో గాని ఆసుపత్రి(పిచ్చాసుపత్రి)లో చూపించండమ్మా’’ అని అయ్యన్న పాత్రుడు అన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఒక ఎయిర్‌పోర్ట్ కట్టాలంటూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని అయ్యన్నపాత్రుడు పూర్తిగా తప్పు బట్టారు.
జగన్ నిర్ణయంపై తాజాగా అయ్యన్న మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మరో తుగ్లక్ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. తుగ్గక్ నిర్ణయాలతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీలు ఏమయ్యాయని అయ్యన్న ప్రశ్నించారు. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ట్రైబల్ యూనివర్సిటీ వంటి వాటి నిర్మాణాలను గాలికొదిలేసి జిల్లాకో ఎయిర్‌పోర్టు కడతావా? అంటూ ఎద్దేవా చేశారు.
ఉద్యోగులకు, పెన్షన్ దారులకు, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేని జగన్.. ఓటీఎస్ పేరుతో పేదల నుంచే డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. చెత్తమీద కూడా పన్ను వసూలు చేస్తూ.. జిల్లాకో ఎయిర్‌పోర్ట్ కడతామని చెప్పడానికి సిగ్గులేదా? అని అయ్యన్న పాత్రుడు నిలదీశారు. గతంలో గుంటూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఇదే అయ్యన్న జగన్‌పై తీవ్రస్థాయిలో సటైర్లతోకుమ్మేయడం తెలిసిందే. ఆ తర్వాత.. మళ్లీ ఇన్నాళ్లకు సీఎంపై అదేరేంజ్‌లో విరుచుకుపడ్డారు.