వైసీపీ సీనియర్ నాయకుడు.. పార్టీలో జగన్ తర్వాత.. జగన్గా పిలుచుకునే నేత.. రాజ్యసభ సభ్యుడు.. విజయసాయిరెడ్డి దూకుడు తగ్గింది. గతంలో ఆయన ఉత్తరాంద్ర జిల్లాల్లోని విశాఖను కేంద్రంగా చేసుకుని రెచ్చిపోయారనే టాక్ ఇంటా బయటా కూడా వినిపించింది. అంతేకాదు.. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఆయన దూకుడు మరింత పెంచారు. పాదయాత్ర చేశారు. అంతేకాదు.. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం.. ఆయన ఇక్కడి కార్మికులతో కలిసి ఉద్యమానికి కూడా కూర్చున్నారు. ఇక, నేతలతోనూ.. ఆయన రాజకీయాలు చేశారు. అయితే.. కొన్నాళ్లుగా ఆయన దూకుడు ఎక్కడా కనిపించడం లేదు.. ఆయన మాట ఎక్కడా వినిపించడం లేదు. దీంతో అసలు ఏమైందనే చర్చ కొన్నాళ్లుగా సాగుతూనే ఉంది. అయితే.. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఎఫెక్ట్ ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎంత ఉందనే చర్చ తెరమీదికి వచ్చింది.
“సాయిరెడ్డి ఇక్కడ కనిపించడం లేదు. ఈ మాట వాస్తవమే. అయితే.. ఆయన ఒక్కరే పార్టీ కాదు. పార్టీ ఆయనతోనే లేదు. పార్టీ కోసం.. ఇక్కడ మాలాంటి వారు చాలా మంది ఉన్నారు. ఆయన ఎందుకు ఇక్కడ నుంచి వెళ్లిపోయారో.. పార్టీకే తెలియాలి. అయినా.. ఆయన లేకపోయినా.. ఇక్కడ ఏదీ ఆగడం లేదు. రేపు ఎన్నికలు వచ్చినా.. ఆయన సత్తా కంటే కూడా.. మాపై ప్రజలకు ఉన్న నమ్మకం.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమమే పార్టీని గెలిపిస్తుంది. కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన ఏదో చేశారని అంటున్నారు. నిజానికి ఆయన వల్ల కొన్ని చోట్ల గెలిచి తీరుతామని అనుకున్నవార్డులు కూడా పోయాయని .. కొందరు అంటున్నారు. సో.. పార్టీలో ఎవరి ప్రభావం ఉండదు. అంతిమంగా.. పార్టీ అధినేత తీసుకునే నిర్ణయమే ఫైనల్“ అని ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేత, ఫైర్ బ్రాండ్ ఒకరు వ్యాఖ్యానించారు.
ఇక, క్షేత్రస్థాయిలోనూ.. విజయసాయిరెడ్డిని పెద్దగా ఎవరూ స్మరించుకోవడం లేదు. “ఆయన ఉంటే ఏం జరుగుతుంది.. రెండు మీడియా మీటింగులు పెట్టి వెళ్లిపోతారు. మాకు అది చేయొద్దు.. ఇది చేయొద్దు అని చెబుతారు. ఆయనను మేం తప్పుబట్టడం లేదు. కానీ.. ప్రజల్లో నెగ్గాం కాబట్టి.. ప్రజల మంచి చెడులపై మాకు కూడా అవగాహన ఉందనే విషయాన్ని చెబుతున్నాం“ అని ఒకరిద్దరు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక, గతకొన్నాళ్లుగా ఆవేదనతో ఉన్న ఒక ఎంపీ.. ఒక మంత్రి సైతం.. ఇప్పుడు సంతోషంగా ఉన్నారనే టాక్వినిపిస్తోంది.
అయితే.. వీరంతా.. సాయిరెడ్డికి బద్ధ వ్యతిరేకులు కారు. కానీ, ఆయన వల్ల తమ స్వతంత్రం పోతోందని.. నేరుగా ప్రజలను కలుసుకునే అవకాశం ఆయన ఉంటే దక్కడం లేదని మాత్రమే వారు చెబుతున్నారు. ఏదేమనా.. వైసీపీ నేతల వ్యాఖ్యలను గమనిస్తే.. సాయిరెడ్డి ప్రభావం ఉత్తరాంధ్రపై పెద్దగా కనిపించడం లేదన్నది వాస్తవం అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates