జనసేనాని పవన్‌కు మరో చిక్కు వచ్చి పడిందా? ఆయన ఎటూ తేల్చుకోలేక పోతున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పార్టీ నేతలు. తాజాగా ఆయన వర్చువల్‌గా పార్టీ నేతలతో మాట్లాడుతూ.. పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుల విషయంలో ఒక్కడినే నిర్ణయం తీసుకోనన్నారు. ప్రతి జనసైనికుడి ఆలోచనతో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే బీజేపీతో జనసేన పొత్తులో ఉందని, పలు పార్టీలు జనసేనతో పొత్తు కోరుకోవచ్చన్నారు. జనసేన క్షేత్రస్థాయిలో పుంజుకుంటోందని, పొత్తులపై ఒకే మాట మాట్లాడుదామని, పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెడదామని పార్టీ శ్రేణులకు పవన్ సూచించారు.
అంతేకాదు, పలు పార్టీలు జనసేనతో పొత్తు కోరుకోవచ్చునని.., అదంతా మైండ్ గేమ్ అనుకోవచ్చునని పవన్ అన్నారు. జనసేన క్షేత్రస్థాయిలో పుంజుకుంటోందని.. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టిపెట్టాలని శ్రేణులకు సూచించారు. ఈ వ్యాఖ్యలను బట్టి.. పొత్తు విషయంలో జనసేనాని ఆచి తూచి అడుగులు వేస్తున్నారా? లేక ఆయనపై బీజేపీ నుంచి ఒత్తిడి ఉందా? అనే చర్చ జోరుగా సాగుతోంది.
ఎందుకంటే.. 2014లో టీడీపీ, బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకున్న పవన్.. 2019 ఎన్నికలకు వచ్చే సరికి మాత్రం ఒంటరిగానే బరిలో నిలిచారు. తర్వాత.. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అయితే.. ఇప్పుడు.. టీడీపీ వ్యూహాత్మకంగా మరోసారి జనసేనతో పొత్తుకు రెడీ అవుతోంది. కానీ, జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ.. టీడీపీతో కలిసి పనిచేసేందుకు ఇష్టపడడం లేదు. ఇదే విషయంపై ఇటీవల బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. మరోసారి ఎన్నికల్లో టీడీపీతో కలిసి పనిచేసేది లేదని.. బీజేపీ అధిష్టానం కూడా ఇదే విధంగా ఆలోచనలో ఉందని.. కాబట్టి టీడీపీతో పొత్తు వద్దని నిర్ణయానికి వచ్చారు.
అయితే.. ఇప్పుడు జనసేనతో టీడీపీ పొత్తుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో బీజేపీ తన వైఖరిని వెల్లడించడంతో జనసేన అధినేత తర్జన భర్జనలో పడ్డారు. ప్రస్తుతానికి ఆయన ఈ విషయాన్ని కార్యకర్తల కోర్టులోకి నెట్టేసినా.. దీనిని రేపో మాపో.. కార్యకర్తలు అందరూ కోరుతున్నారని.. అందుకే తాను పొత్తులకు సిద్ధపడుతున్నానని ప్రకటించే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఏదేమైనా.. ఇప్పుడు బీజేపీ బాధితురాలిగా మారడం ఖాయమని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates