జగన్ పాలనపై బీజేపీ ఫైర్.. అంతా రివర్సేనంట

ram madhav

ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై బీజేపీకి చెందిన కీలక నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి రాం మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలన సాంతం రివర్స్ లోనే సాగుతోందని ఘాటు విమర్శలు చేసిన రాం మాధవ్… జగన్ పాలన కారణంగా రాష్ట్రంలో ఆదాయం భారీగా పడిపోయిందని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్ పాలనలో రివర్స్ టెండరింగ్ అంటూ దాదాపుగా అన్ని పనులకూ ‘రివర్స్’ మంత్రాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానంతో రాష్ట్ర ఖజానాకు భారీ ఎత్తున ఆదాయం వస్తుందని వైసీపీ చెబుతుంటే… ఈ రివర్స్ మంత్రంతో రాష్ట్ర ఆదాయం మునుపెన్నడూ లేనంత రీతిలో అధో:పాతాళానికి పడిపోయిందని రాం మాధవ్ ఆరోపించారు.

హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన బీజేపీ కార్యక్రమంలో పాలుపంచుకున్న రాం మాధవ్… జగన్ పాలనపై తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. మాట్లాడారు. ఈ సందర్భంగా రాం మాధవ్ ఏమన్నారన్న విషయానికి వస్తే… ‘‘ఓ వైపు కేంద్రంలో మోదీ ప్రభుత్వం అభివృద్ధి మంత్రంతో దూసుకెళ్తుంటే.. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో రివర్స్ మంత్రం. అన్నీ రివర్సే. రాజధానితో మొదలైంది రివర్స్. పోలవరం ప్రాజెక్టుకు టెండర్లు రివర్స్, అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తామన్నారు. దాంట్లో రివర్స్. ఇప్పుడు కొత్త కొత్త బ్రాండ్లతో మద్యం ప్రవహిస్తోంది.

తిరుమల ఆలయ భూములు, ఆస్తులు అమ్మేసే ప్రయత్నం చేశారు. ప్రజలు రివర్స్ కావడంతో అక్కడా రివర్స్ అయ్యారు. ఎలక్షన్ కమిషనర్‌లో రివర్స్. బహుశా 60 సార్లు (సగటున వారానికి ఓసారి) హైకోర్టుతో మొట్టికాయలు వేయించుకున్న ప్రభుత్వం దేశంలో ఇంకెక్కడా లేదు. బెయిల్ మీద ఒకాయన ఉంటే, బెయిల్ కోసం తయారీలో ఇంకొకాయన ఉన్నారు.’ అని రాంమాధవ్ ఓ రేంజిలో జగన్ పాలనపై విరుచుకుపడ్డారు.

ఇక ఏపీ ప్రభుత్వానికి సహకారం అందించడానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉందని రాం మాధవ్ వ్యాఖ్యానించారు. పన్ను నిష్పత్తి కింద ఏపీ నుంచి 41 శాతం వాటా కింద దాదాపు రూ.35,000 కోట్ల ఆదాయం కేంద్రానికి రావాల్సి ఉందని ఆయన అన్నారు. అయితే ఏడాదిగా వైసీపీ పుణ్యమా అని రెవిన్యూ పెరగకపోగా ఆదాయం తగ్గిపోయిందన్నారు. పుండు మీద కారం లాగా కోవిడ్ 19 సమస్య వచ్చిందన్నారు. దీని వల్ల రాష్ట్ర ఆదాయంతో పాటు కేంద్రం ఆదాయం తగ్గిందన్నారు.

రాష్ట్రం నుంచి అంచనా ప్రకారం ట్యాక్స్ రెవిన్యూ రాకపోయినా కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు ఇస్తామన్న వాగ్దానంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ట్యాక్సులు వసూలు కాకపోయినా రెండు విడతల్లో రూ.10,000 కోట్లు ఏపీకి కేంద్రం ఇచ్చిందని చెప్పారు. స్థానిక సంస్థల కోసం రూ.3,900 కోట్లు ఇచ్చామన్నారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ రిలీఫ్ కింద రూ.1,100 కోట్ల పై చిలుకు డబ్బులు చెల్లించామన్నారు.

ఈ ఏడాది మొత్తం రూ.45,000 కోట్లు కేంద్రం నుంచి ఏపీకి లభిస్తోందన్నారు. ఓ వైపు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ ఇస్తున్నామని చెబుతూనే.. జగన్ పాలన సాంతం రివర్స్ లోనే సాగుతోందని రాం మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేయడం నిజంగానే సంచలనంగా మారింది.