రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఒక్క రోజులోనే ఒక్క సంఘటనతోనే పరిస్థిలు తారు మారు కావొచ్చు. అది ప్రత్యర్థి పార్టీ పుంజుకునేందుకు.. అధికార పార్టీ స్పీడ్‌కు కళ్లెం వేసేందుకు కారణం కావొచ్చు. ఇప్పుడు తెలంగాణలోనూ అదే పరిస్థితి ఉందని రాజకీయ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జైలుకు వెళ్లి రావడంతో ఒక్కసారిగా ఆ పార్టీలో జోష్ మరింత పెరిగిందని చెబుతున్నారు. ఇక అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్‌పై బీజేపీ పోరాటం మరో స్థాయికి చేరబోతుందనే అంచనాలు వేస్తున్నారు.
మొదటి నుంచి..
తెలంగాణలో వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్‌కు ఇక తిరుగులేదనే అంతా అనుకున్నారు. కానీ ఏడేళ్లుగా ఆధిపత్యం చలాయించిన ఆ పార్టీకి 2020 నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. ఆ ఏడాది మార్చిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ తనదైన దూకుడుతో కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ సాగుతున్నారు. తన జోరుతో పార్టీ శ్రేణుల్లోనూ ఉత్సాహాన్ని నింపి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. దానికి తోడు దుబ్బాక ఉప ఎన్నికలో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేసీఆర్‌కు బీజేపీ షాక్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఆ విజయాలు ఇచ్చిన ఉత్సాహంతో సంజయ్ మరింత వేగం పెంచారు. నిరసనలు, ఆందోళనలు అంటూ పార్టీని పరుగులు పెట్టిస్తూ కేసీఆర్‌కు కంగారు పుట్టిస్తున్నారు. ఇక ఈ ఏడాది కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసిన ఈటల రాజేందర్ గెలవడంతో ఆ పార్టీకి పట్టాపగ్గాలు లేకుండా పోయింది.
ఇప్పుడదే బాట..
రాష్ట్రంలో బీజేపీ బలంగా ఎదుగుతుందని భావించిన కేసీఆర్ ఆ పార్టీ జోరుకు కళ్లెం వేసేందుకు సిద్ధమయ్యారు. ఆ క్రమంలోనే వరి కొనుగోళ్ల విషయంపై కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విమర్శలు, ఆరోపణలు చేశారు. ఇక ఇప్పుడు ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీల కోసం తెచ్చిన 317 జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ జాగరణ దీక్షకు పూనుకున్న సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి 14 రోజుల రిమాండ్‌కు జైలుకు తరలించారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్ జైలు నుంచి బయటికి వచ్చారు. ఈ ఎపిసోడ్ మొత్తం బీజేపీకి లాభాన్ని చేకూరిస్తే.. టీఆర్ఎస్‌ను మరింత ఇబ్బందిపెడుతుందని విశ్లేషకులు అంటున్నారు. సంజయ్‌ను కక్ష్యపూరితంగానే కేసీఆర్ జైల్లో పెట్టించారనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ సఫలమైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు జైలుకు వెళ్లి వచ్చే నాయకులు జనాల్లో హీరోలవుతారనే అభిప్రాయం ఎలాగో ఉంది. ఇక ఇప్పుడు ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసమే తాను జైలుకు వెళ్లానని చెప్పుకుంటున్న సంజయ్‌కు ఆ వర్గంలో ఆదరణ పెరుగుతుందనడంలో సందేహం లేదు ఈ నేపథ్యంలో బీజేపీ జోష్ హైలో ఉంది. కేసీఆర్‌పై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని చూస్తోంది.