రేవంత్ రెడ్డి.. సొంత ఛానెల్

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీకి ఊహించిన స్థాయిలో మీడియా మ‌ద్దతు ఉండ‌డం లేదా? అందుకే టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి స్వ‌యంగా ఓ ఛానెల్ పెట్టేందుకు సిద్ద‌మ‌వుతున్నారా? అంటే అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి. రాజ‌కీయాల్లో నిల‌బ‌డాలంటే ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉండాలి. కానీ ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు చేరువ కావాలంటే అందుకు మీడియా ఓ సాధ‌నంగా ఉప‌యోగ‌ప‌డుతోంది. ఇప్పుడు మీడియా పెద్ద‌ల ఆశీర్వాదం రాజ‌కీయ పార్టీల‌కు ఎంతో అవ‌స‌రం. ఈ విష‌యాన్ని గ్ర‌హించిన రేవంత్ రెడ్డి ఏ మీడియా నుంచి పెద్ద‌గా స‌పోర్ట్ లేక‌పోవ‌డంతో సొంతంగా ఛానెల్ పెట్టేందుకు సిద్ధ‌మ‌య్యార‌నే ప్ర‌చారం సాగుతోంది.

రాజ‌కీయ పార్టీ ప్ర‌జ‌ల నోళ్ల‌లో నానాలంటే అందుకు మీడియా ప్ర‌ధాన కార‌ణం. ఈ విష‌యం రేవంత్‌కు తెలియంది కాదు. అందుకే ఆయ‌న పీసీసీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌క‌ముందే తెలుగు రాష్ట్రాల్లోని మీడియా అధినేత‌ల‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. కానీ వాళ్ల నుంచి ఆశించిన మ‌ద్ద‌తు ల‌భించ‌డం లేద‌ని రేవంత్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

అందుకే ఆయ‌నే సొంతంగా ఓ శాటిలైట్ ఛానెల్‌ను ఏర్పాటు చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. లేక‌పోతే ప్ర‌స్తుతం ఏదైనా ఓ ఛానెల్‌కు ఆర్థికంగా అండ‌గా నిల‌బ‌డి వార్త‌లు ప్ర‌సారం చేయించుకోవాల‌నే యోచ‌న కూడా చేస్తున్న‌ట్లు టాక్‌. కానీ చివ‌ర‌కు సొంత ఛానెల్‌కు ఆయ‌న మొగ్గు చూపుతున్న‌ట్లు తెలిసింది. ముందుగా ఓ యూట్యూబ్ ఛానెల్ మొద‌లెట్టి.. ఆ త‌ర్వాత అదే పేరుతో శాటిలైట్ ఛానెల్ నెల‌కొల్పాల‌న్న‌ది రేవంత్ ఆలోచ‌న‌గా తెలుస్తోంది.

దాని కోసం ఇప్ప‌టికే ఆయ‌న గ్రౌండ్ లెవెల్‌లో వర్క్ చేస్తున్నార‌ని స‌మాచారం. అందులో భాగంగానే త‌న‌తో స‌న్నిహితంగా ఉండే కొంద‌రు మీడియా ప్ర‌తినిధుల‌తో రేవంత్ సంప్ర‌దించార‌ని టాక్‌. ఓ టాప్ న్యూస్ ఛానెల్‌లోని ఓ సీనియ‌ర్ జ‌ర్నలిస్ట్ రాజీనామా వెనక కూడా రేవంత్ ఛానెల్ కార‌ణంగా ఉంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఆ జ‌ర్న‌లిస్ట్ రేవంత్ ఛానెల్ బాధ్య‌త‌లు చూసుకుంటార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నేరుగా టీవీ ఛానెల్ పెట్ట‌డం కంటే కూడా యూట్యూబ్ ఛానెల్ పెట్టి దాన్ని విజ‌య‌వంతం చేసిన త‌ర్వాత పార్టీ త‌ర‌పున అదే పేరుతో శాటిలైట్ ఛానెల్ పెట్ట‌బోతున్నార‌ని తెలిసింది.