రాజుగారి చిన్న భార్య మంచిదంటే.. పెద్ద భార్య.. సామెతలా కూడా కాకుండా సుత్తి లేకుండా స్ట్రెయిట్ గా తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన.. ఏపీ లోని పరిస్థితిని చెప్పకనే చెప్పేశారు. తెలంగాణ గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నంలో.. ఏపీలోని వాస్తవ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పారు.
తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రాలో 100 ఎకరాలు కొనే స్థాయికి భూముల ధరలు పడిపోయాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు ఆంధ్రాలో 10 ఎకరాలు అమ్మితే తెలంగాణలో 100 ఎకరాలు కొనేవారని.. ఇప్పుడు సీన్ రివర్సు అయ్యిందన్నారు. ప్రస్తుతం ఏపీలో భూముల ధరలు దారుణంగా పడిపోయినట్లు చెప్పారు.
ఇప్పటికే జగన్ సర్కారు పుణ్యమా అని ఏపీలో రియల్ ఎస్టేట్ దారుణంగా దెబ్బ తిన్నదని.. ఇటీవల కాలంలో పరిస్థితు మరింత దారుణంగా తయారై.. భూముల ధరలు పెద్దగా లేవన్న మాట వినిపిస్తోంది. ఏపీలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏపీలో తమ వ్యాపారాన్ని పక్కన పెట్టేసి.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టటం ఎక్కువైంది.
కొత్త సంవత్సరం వేళ ఏపీ విపక్ష నేత చంద్రబాబు సైతం.. ఇదే విషయాన్ని ప్రస్తావించారు. గతంలో ఇతర రాష్ట్రాల వారు ఏపీకి ఉపాధి కోసం వచ్చేవారని.. ఇప్పుడు ఏపీ ప్రజలు ఉపాధి కోసం తెలంగాణ.. కర్ణాటక రాష్ట్రాలకు వలస వెళుతున్నారని పేర్కొనటం తెలిసిందే. ఈ వాదనకు బలం చేకూరేలా తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు ఉన్నట్లుగా చెప్పాలి. ఏపీ పరిస్థితి ఎంత దారుణంగా మారిందన్న దానికి టీ మంత్రి వ్యాఖ్యలు నిదర్శనంగా మారాయి.