నరేంద్ర మోడీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నారా ? అవుననే అనిపిస్తోంది క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే. అప్పుడు మూడు వ్యవసాయ చట్టాలకు చేసిన తప్పునే ఇపుడు అమ్మాయిల వివాహ వయస్సు విషయంలో కూడా చేస్తున్నారు. ముందుగా నిర్ణయం తీసేసుకోవటం తర్వాత వివాదం రేగగానే దానిపై అద్యయనానికి కమిటి వేయటం మోడీ ప్రభుత్వానికి ఇది రెండోసారి. పైగా ఇపుడు నియమించిన కమిటిలో కేవలం ఒకే ఒక్క మహిళా ఎంపిని నియమించటం మరిన్ని వివాదాలకు కారణమవుతోంది.
అమ్మాయిల వివాహ వయస్సు 18 ఏళ్ళ నుండి 21 సంవత్సరాలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే దీనిపై వివాదం మొదలైంది. సరే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకించే ప్రతిపక్షాలు, జనాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ఇపుడు కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. వివాదం బాగా పెద్దదవుతున్న నేపధ్యంలో బిల్లును సమగ్రంగా చర్చించేందుకు, పరిశీలించేందుకు పార్లమెంట్ స్ధాయి సంఘాన్ని కేంద్రం నియమించింది.
31 మంది ఎంపీలతో కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీలో కేవలం ఒకే ఒక్క మహిళా ఎంపీ ఉండటం వివాదానికి కారణమవుతోంది. అమ్మాయిల వివాహ వయస్సును నిర్ణయించే కమిటీలో ఎక్కువ మంది మహిళా ఎంపీలను నియమించకుండా పురుషులనే నియమించటం ఏమిటంటు మిగిలిన మహిళా ఎంపీలు మోడిపై మండిపోతున్నారు. అమ్మాయిల వివాహ వయసు ఎంతుండాలనే విషయాన్ని చర్చించాల్సింది మహిళలే కానీ పురుషులు కాదు కదా అంటు రాజ్యసభ ఎంపీ జయాబచ్చన్ వాదన మొదలుపెట్టారు.
జయ వాదనకు మిగిలిన పార్టీల్లోని మహా ఎంపీల నుంచి మద్దతు పెరుగుతోంది. మహిళా సమస్యలను చర్చించే కమిటీలో పురుషుల మెజారిటీ ఏమిటంటు చాలామంది లా పాయింట్లు లాగుతున్నారు. వాళ్ళ పాయింట్ కూడా కరెక్టే. మరి కమిటిని నియమించే ముందు కేంద్ర ప్రభుత్వం ఇంత చిన్న విషయాన్ని ఎందుకు ఆలోచించలేదో అర్ధం కావటం లేదు. అమ్మాయిల వివాహ వయస్సు ఎంతుండాలని పరిశీలించే 31 మంది సభ్యుల కమిటిలో కనీసం సగంమంది మహిళా ఎంపీలుండాల్సిందే అనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ముందు నిర్ణయం తీసుకోవటం తర్వాత తీరిగ్గా కమిటీలు వేయటం మోడీ సర్కార్ కు అలవాటైపోయింది.