జగన్ ఢిల్లీ టూర్.. ఎవరెవరిని కలుస్తున్నారు?

ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో ఏపీ బీజేపీ నేతలు జగన్ పాలనపై విరుచుకుపడటమే కాదు.. రెండు పార్టీల మధ్య లడాయి మోతాదు మించిన పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి మరో ఒకట్రెండు నెలల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయన్న అంచనా ఒకవైపు.. సీఎం జగన్ మీద ఉన్న అవినీతి కేసులకు సంబంధించి అంశం ఏదైనా తెర మీదకు వస్తుందన్న మాటతో పాటు.. ఆయన సోదరి షర్మిలతో ఆయనకు విభేదాలు పెద్ద ఎత్తున పెరిగి… వివేక హత్య ఉదంతంలో ఆమె సీబీఐకి స్టేట్ మెంట్ ఇస్తుందన్న వాదన వినిపిస్తోంది.

ఇలాంటి పలు పరిణామాలు చోటు చేసుకున్న వేళ.. సీఎం జగన్ అనూహ్యంగా ఢిల్లీ పర్యటనకు సంబంధించిన ప్రకటన చేయటం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. కొత్త సంవత్సరంలో కొంగొత్త రాజకీయ పరిణామాలు ఏపీలో చోటు చేసుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తున్న వేళలో.. జగన్ ఢిల్లీ పర్యటనపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. సాధారణంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరైనా తమ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన వివరాల్ని కనీసం వారం ముందే చెబుతుంటారు.

అందుకు భిన్నంగా కేవలం రోజు వ్యవధిలో ఢిల్లీ టూర్ గురించి సీఎం జగన్ డిసైడ్ అయినట్లుగా ఆయన కార్యాలయ సిబ్బంది చేస్తున్న ప్రకటన ఇప్పుడు ఏపీతో పాటు తెలంగాణలోనూ ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇటీవల కేంద్ర మంత్రి.. బీజేపీలో కీలక నేతగా వ్యవహరించే అమిత్ షాను తెలుగు రాష్ట్రలకు చెందిన కమలనాథులు భేటీ కాగా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ సైతం ముందుస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని.. అందుకు తగ్గట్లు  ఏర్పాట్లు చేసుకోవాలని సూచన చేసినట్లుగాచెబుతున్నారు.

ఇలాంటి వేళ జగన్ ఢిల్లీకి వెళ్లటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే తన ఢిల్లీ టూర్ సందర్భంగా ఎవరిని కలవాలి? అన్న దానిపై క్లారిటీ ఉందని.. ప్రధాని మోడీతో పాటు కేంద్రమంత్రి అమిత్ షా.. తదితర మంత్రుల నుంచి ముందస్తుగానే అపాయింట్ మెంట్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు. జగన్ తాజా పర్యటనలో కీలకమైన అంశాల్లో ఒకటి నిధుల సమీకరణ. కేంద్రం నుంచి రుణ పరిమితిని పెంచాలన్న విన్నపాన్ని కేంద్రం ముందు ఉంచుతారని చెబుతున్నారు. ఈ మధ్యన తిరుపతికి వచ్చిన అమిత్ షా ఎదుట కూడా.. రుణ పరిమితి వ్యవహారం మీద జగన్ తమ వినతిని పెట్టినట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో ఏపీ రుణ పరిమితి విషయంలో జగన్ కేంద్రం నుంచి సాయం కోరుతున్నారు.

అమరావతి విషయంలో కేంద్రం మూడ్ ఏ రీతిలో ఉందన్న విషయాన్ని చర్చిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే మూడు రాజధానుల బిల్లుకు సంబంధించి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకోవటం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం ఏమని ఆలోచిస్తుందన్న విషయాన్ని తెలుసుకోవటం కూడా జగన్ మీద ఉందంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తుకు వెళ్లే పక్షంలో తాను కూడా అందుకు రెఢీ అన్న మాటను చెబుతారంటన్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఏపీకి నష్టం ఎక్కువగా జరిగిందని.. కానీ పరిహారం చాలా తక్కువగా వచ్చిందన్న మాట ఉంది. ఈ విషయాన్ని కూడా కేంద్రానికి అర్థమయ్యేలా చెబుతారని చెబుతున్నారు. కేంద్రానికి తాము అన్ని విధాలుగా సహకరిస్తున్నా.. తమ డిమాండ్లను పరిష్కరించే విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్న వైనాన్ని తెలియజేస్తారని తెలుస్తోంది. దీంతో పాటు. త్వరలో వచ్చే రాష్ట్రపతి.. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్రానికి తమ వంతు సాయాన్ని అందిస్తామని స్పష్టం చేస్తారని తెలుస్తోంది. మొత్తంగా పలు అంశాల్ని ఎజెండా తీసుకొని వెళుతున్న జగన్.. కొన్ని బయటకు చర్చించలేని అంశాల మీదా చర్చ జరుగుతుందని చెబుతున్నారు. ఇంతకీ.. ప్రధాని మోడీ సీఎం జగన్ కు అపాయింట్ మెంట్ ఇస్తున్నారా? అన్నది అసలు ప్రశ్నగా మారింది.