6 వేల ఎన్జీవోలకు మోడీ దెబ్బ

మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది మోడీ సర్కారు. పలు విదేశీ సంస్థల నుంచి దేశంలోకి వచ్చే విదేశీ విరాళాల మీద కత్తి దూసింది. దేశ వ్యాప్తంగా దాదాపు 6 వేల ఎన్జీవోల విదేశీ విరాళాల లైసెన్సుల్ని రద్దు చేయటం గమనార్హం. నిబంధనల్ని అత్రికమించారని కేంద్రం చెబుతుంటే.. ఇదంతా కక్ష సాధింపు చర్యలో భాగమని సదరు సంస్థలు ఆరోపిస్తున్నాయి. అయితే..  ఇలా పలు విదేశీ స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చే విరాళాలకు చెక్ పెట్టటం ఇదే తొలిసారి కాదు. గత ఏడాదిలో కూడా భారీగా కొన్ని ఎన్జీవోల మీద కత్తి చూసింది కేంద్రం.

గత ఏడాదిలో రద్దు చేసిన  సంస్థల లైసెన్సులతో కలిపితే.. తాజాగా రద్దు చేసినవి కలిపి 12వేల వరకు ఉంటాయని చెబుతున్నారు. ఏ ఎన్జీవో అయినా ఇతర దేశాలకు చెందిన వ్యక్తులు.. సంస్థల నుంచి విరాళాలు స్వీకరించాలంటే.. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద లైసెన్సు తీసుకోవాలి. ప్రస్తుతం ఆ లైసెన్సు తీసుకునే గడువు డిసెంబరు 31తో ముగిసింది. ఇలాంటివేళ పలు సంస్థలు విరాళాలని స్వీకరించటానికి వీలుగా లైసెన్సుల్ని రెన్యువల్ చేసుకుంటుంది. అయితే.. కేంద్రం నిబంధనల్ని పక్కాగా అమలు చేయటంతో కొన్ని సంస్థలు రెన్యువల్ కు రాలేదు.

మరికొన్ని అప్లికేషన్లు పెట్టుకున్నా.. వాటిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇలా రద్దు చేసిన సంస్థలు ఈ ఏడాది 5933గా ఉన్నట్లు చెబుతున్నారు. దేశంలో మొత్తం 22,762 విదేశీ విరాళాలు పొందే ఎన్జీవోలు ఉంటే.. శనివారం నాటికి వాటి సంఖ్య 16,829కు తగ్గినట్లుగా చెబుతున్నారు.

మత మర్పిళ్లకు పాల్పడుతున్నాయన్న కారణంతో కొన్ని సంస్థలకు లైసెన్సు పునరుద్దరణకు కేంద్రం కొర్రీలు వేస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే.. ఇదేమీ నిజం కాదని.. నిబంధనలకు అనుగుణంగా లేని వాటినే రద్దు చేస్తున్నట్లు చెబుతున్నారు. తాజాగా లైసెన్సుల్ని కోల్పోయిన వాటిల్లో పేరున్న పలు ఎన్జీవోలు ఉన్నట్లుచెబుతున్నారు. అయితే.. కొందరు లైసెన్సుల్ని రెన్యువల్ చేసుకోవటానికి అప్లికేషన్లుపెట్టుకోలేదని చెబుతున్నారు. ఏమైనా.. లైసెన్సుల రద్దు విషయంలో మోడీ సర్కారు తీరు మాత్రం హాట్ టాపిక్ గా ఉందని చెబుతున్నారు.