2021: కేసీఆర్‌కు మిగిలిందేమిటీ?

రాజ‌కీయ చాణ‌క్యుడు అని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పేరుంది. ఆయ‌న తిమ్మిని బొమ్మిని చేయ‌గ‌ల‌రు. ఆయ‌న వ్యూహాల‌కు తిరుగుండ‌ద‌నే అంతా చెప్తారు. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్య‌మం స‌మ‌యంలోనూ.. ఆ త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చాక కూడా ఆయ‌న ప్ర‌ణాళిక‌లు స‌మ‌ర్థంగా అమ‌లు చేశారు. వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లోనూ పార్టీని గెలిపించుకున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌ను తిరుగులేని శక్తిగా నిలిపారు. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు ఆయ‌న‌కు స‌వాళ్లు విసురుతున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది కేసీఆర్‌కు ఓట‌ములు, వైఫ‌ల్యాలు, స‌వాళ్లు త‌ప్ప ఏమీ మిగ‌ల్లేద‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఆ ఓట‌మి..
గ‌తేడాది నుంచే తెలంగాణ రాజ‌కీయాలు మారుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా బండి సంజ‌య్ నియామ‌కం త‌ర్వాత ఆ పార్టీ జోరు పెంచింది. నిరుడు దుబ్బాక ఉప ఎన్నిక‌, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో కేసీఆర్‌కు ఆ పార్టీ షాకిచ్చింది. ఈ ఏడాది కూడా అదే వ‌ర‌స కొన‌సాగింది. కేసీఆర్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో పార్టీ ఓట‌మి పాల‌వ‌డంతో గ‌ట్టిదెబ్బ ప‌డింది. టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి బీజేపీ త‌ర‌పున హుజూరాబాద్‌లో పోటీచేసి ఈట‌ల గెల‌వ‌డం కేసీఆర్ జీర్ణించుకోలేక‌పోయార‌ని అంటున్నారు. అక్క‌డ విజ‌యం ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌డ‌మే కాకుండా దాదాపు రూ.600 కోట్ల‌ను వివిధ రూపాల్లో కేసీఆర్ ఖ‌ర్చు పెట్టార‌ని స‌మాచారం.

ఆ వ్య‌తిరేక‌త‌..
హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల కోసం తెచ్చిన ద‌ళిత బంధు ఇప్పుడు కేసీఆర్ మెడ‌కు చుట్టుకుంద‌నే అభిప్రాయాలు వ్యక్త‌మ‌వుతున్నాయి. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల లోపు ద‌ళిత‌ కుటుంబాల‌కు ఆ సాయం అందించ‌క‌పోతే అది ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపుతుంది. ఇక ఈ ఏడాది నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌లో విజ‌యంతో పాటు ఎమ్మెల్యే, స్థానిక సంస్థ‌ల కోటాలో జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను ఆ పార్టీ క్లీన్‌స్వీప్ చేయ‌డం కేసీఆర్‌కు ఉప‌శ‌మ‌నాన్ని క‌లిగించే విష‌యం.

అయితే త‌న‌కు రాజ‌కీయ శ‌త్రువైన రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్య‌క్షుడిగా ఎంపిక‌వ‌డం కేసీఆర్‌కు రుచించ‌ని విష‌య‌మే. మ‌రోవైపు వ‌రి కోనుగోళ్ల విష‌యంలో ముఖ్య‌మంత్రి హోదాలో తొలిసారి కేసీఆర్ దీక్ష‌కు దిగారు. కానీ మ‌రోవైపు ఉద్యోగ నోటిఫికేష‌న్లు విడుద‌ల చేయ‌క‌పోవ‌డం, ఇప్పుడు ఉద్యోగ బ‌దిలీల విష‌యంలో కేసీఆర్‌పై వ్య‌తిరేక‌త వ‌స్తోంది. ఇక బీజేపీ, కాంగ్రెస్‌తో ఆయ‌న‌కు స‌వాళ్లు ఎదుర‌వుతూనే ఉన్నాయి.