రాష్ట్రం త‌గల‌బ‌డుతుందంటే సీఎం అయ్యా!

బాబ్రీ మ‌సీదు కూల్చివేత అనంత‌రం దేశ‌వ్యాప్తంగా అల్ల‌ర్లు చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. అప్పుడు ముంబ‌యి కూడా అట్టుడికిపోయింది. అల్ల‌రి మూక‌ల దాడుల్లో తీవ్ర నష్టం జ‌రిగింది. అప్ప‌టి ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిగా నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్య‌క్షుడు శ‌ర‌ద్ ప‌వార్ బాధ్య‌త‌లు తీసుకున్నారు. కానీ అప్పుడు సీఎంగా అయిష్టంగానే కుర్చీ ఎక్కాన‌ని ఆయ‌న తాజాగా వెల్ల‌డించారు. 1993లో ఇష్టం లేకున్నా భావోద్వేగ‌పూరిత వాతావ‌ర‌ణంలో మ‌హారాష్ట్రకు సీఎం అయ్యాన‌ని ఆయ‌న పేర్కొన్నారు.

అప్ప‌టి ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు ప్ర‌భుత్వంలో కీల‌క‌మైన ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా శ‌ర‌ద్ ప‌వార్ ప‌ని చేశారు. కానీ బాబ్రీ మ‌సీదు కూల్చివేత అనంత‌రం ముంబ‌యిలో చెల‌రేగిన అల్ల‌ర్ల‌ను అణ‌చివేసి శాంతిని నెల‌కొల్ప‌డం కోసం రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా తాను బాధ్య‌త‌లు చేప‌ట్ట‌క త‌ప్ప‌లేద‌ని ప‌వార్ అన్నారు. “1992 డిసెంబ‌ర్‌లో బాబ్రీ మ‌సీదు కూల్చివేత అనంత‌రం మొద‌లైన అల్ల‌ర్లు ముంబ‌యిని కుదిపేశాయి. రెండు వారాల‌కు పైగా జ‌న‌జీవ‌నం స్తంభించింది. అప్పుడు ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా ఉన్న న‌న్ను మ‌హారాష్ట్ర వెళ్లి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టాల‌ని అప్ప‌టి ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు ఆదేశించారు. కానీ అందుకు నేను మొద‌ట తిర‌స్క‌రించా. ఆ త‌ర్వాత అల్లర్లు మ‌రిన్ని న‌గ‌రాల‌కు విస్త‌రించాయి.

అప్పుడు పీవీతో పాటు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు ఎన్‌కేపీ సాల్వే త‌దిత‌రులు, నేను స‌మావేశ‌మ‌య్యాం. ఆ త‌ర్వాత పీవీ న‌న్ను కార్యాల‌యానికి పిలిచి మ‌హారాష్ట్రకు సీఎంగా వెళ్ల‌డం త‌ప్ప మ‌రో దారి క‌నిపించ‌డం లేద‌ని చెప్పారు. ఆరు గంట‌ల పాటు న‌న్ను ఒప్పించేందుకు ప్ర‌య‌త్నించారు. నేను పుట్టి పెరిగిన రాష్ట్రం, న‌గ‌రం త‌గ‌ల‌బ‌డిపోతుంది. ఈ ప‌రిస్థితుల్లోనూ నువ్వు అక్క‌డికి వెళ్ల‌క‌పోతే అంత‌కంటే విచారం మ‌రొక‌టి ఉండ‌దు అని పీవీ చెప్పారు. భావోద్వేగానికి గురైన నేను రాష్ట్రానికి తిరిగి వ‌చ్చా” అని ప‌వార్ పేర్కొన్నారు.
రాష్ట్రం త‌గ‌ల‌బ‌డుతోంద‌ని చెప్పిన పీవీ.. ప‌వార్‌లో భావోద్వేగాల‌ను బ‌య‌ట‌కు తీశారు. దీంతో ఆయ‌న మ‌హారాష్ట్ర సీఎంగా ప‌ద‌వి చేప‌ట్టి ప‌రిస్థితుల‌ను అదుపులోకి తెచ్చారు. రాష్ట్రంలో శాంతిని తిరిగి పున‌రుద్ధ‌రించ‌డం సంతృప్తినిచ్చింద‌ని ఆయ‌న చెప్పారు.