మంగ‌ళ‌గిరి సీటుపై లోకేష్ ఫోకస్

టీడీపీ యువ‌నేత‌, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ గ‌త ఎన్నిక‌ల్లోనే తొలిసారిగా ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగారు. పార్టీలో కీల‌క ప‌ద‌విలో ఉండి.. మంత్రిగా కూడా ఉన్న లోకేష్‌కు తొలి ఎన్నిక‌లే పీడ‌క‌ల‌గా మారాయి. ఆ ఎన్నిక‌ల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవ‌డంతో పాటు లోకేష్ కూడా 6 వేల ఓట్ల తేడాతో ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. వైసీపీ త‌న‌ను ఓడించేందుకు ప్ర‌త్యేకంగా ప‌న్నిన వ్యూహంలో లోకేష్ చిక్కుకుపోయారు. పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు రాజ‌ధాని అమ‌రావ‌తి అంటూ ఎక్క‌డ అయితే చంద్ర‌బాబు, టీడీపీ హ‌డావిడి చేసిందో అక్క‌డే లోకేష్ ఓడిపోవ‌డం ఆ పార్టీ వ‌ర్గాల‌కు ఇప్ప‌ట‌కీ ఏ మాత్రం మింగుడు ప‌డ‌లేదు.

మంగ‌ళ‌గిరి కుల స‌మీక‌ర‌ణ‌లు, బ‌లాల ప‌రంగా చూస్తే టీడీపీకి ముందు నుంచి అంత సేఫ్ కాదు. 1994లో మాత్ర‌మే చివ‌రిసారిగా అక్క‌డ టీడీపీ గెలిచింది. అలాంటి చోట పోటీ చేసి లోకేష్ డేర్ చేసినా ఓడిపోయాడు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో అక్క‌డే గెలిచి త‌న తండ్రి చంద్ర‌బాబుకు గిఫ్ట్ ఇస్తాన‌ని ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా తిరుగుతూ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నారు. అక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే రామ‌కృష్ణారెడ్డి మీద వ్య‌తిరేక‌త ఉండ‌డంతో అది కూడా ప్ల‌స్ అవుతుంద‌ని లోకేష్ లెక్క‌లు వేసుకుంటున్నాడు.

అయితే ఇప్పుడు టీడీపీలోనే మంగ‌ళ‌గిరి సీటు కోసం లోకేష్‌కు మ‌రో నేత పోటీ వ‌చ్చాడు. ఆ నేత ఎవ‌రో కాదు మంగ‌ళ‌గిరి లోక‌ల్ నేత అయిన గంజి చిరంజీవి. 2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ పోటీ చేసిన చిరంజీవి 12 ఓట్ల స్వ‌ల్ప తేడాతో ఓడాడు. ఆ త‌ర్వాత ఆయ‌న‌కు పార్టీ మంగ‌ళ‌గిరి మునిసిప‌ల్ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చింది. 2019 ఎన్నిక‌ల్లో సీటు ఆశిస్తే అక్క‌డ లోకేష్ పోటీ చేయ‌డంతో చిరంజీవి కోరిక నెర‌వేర‌లేదు. ఇక ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ తాను ఇక్క‌డ నుంచే పోటీ చేస్తాన‌ని లోకేష్ క్లారిటీ ఇచ్చేయ‌డంతో ఎలాగైనా ఎమ్మెల్యే కావాల‌నుకున్న చిరంజీవి ఆశ‌లు నెర‌వర‌వ‌న్న‌ది ఆయ‌న‌కు అర్థ‌మైంది.

ఇటీవ‌ల మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన లోకేష్‌ను చిరంజీవి మొహం మీదే మీరు ఇక్క‌డ పోటీ చేస్తే తాను ఏం చేయ‌ను ? అని కొంద‌రు నేత‌ల ముందే అడిగేశాడ‌ట‌. అయితే ఆ త‌ర్వాత చిరంజీవిని పిలిపించుకున్న లోకేష్‌.. ప్ర‌కాశం జిల్లా చీరాల‌లో ప‌ద్మ‌శాలి వ‌ర్గం (చిరంజీవి సామాజిక వ‌ర్గం) ఓట‌ర్లు ఎక్కువ‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అక్క‌డ నుంచి పోటీ చేయ్‌.. అక్క‌డ వ‌ర్క్ స్టార్ట్ చేసుకో అని చెప్పార‌ని తెలిసింది.

మంగ‌ళ‌గిరి ఎలాగూ రాద‌ని డిసైడ్ అయిన గంజి చిరంజీవి చీరాల‌కు వెళ్ల‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే రెండు , మూడుసార్లు అక్క‌డ‌కు వెళ్లి వ‌చ్చారు. చీరాల‌లో ప్ర‌స్తుతం టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఎడం బాలాజీ ఉన్నారు. ఆయ‌న వైసీపీ నుంచి పార్టీలోకి వ‌స్తే.. ఎవ్వ‌రూ గ‌తిలేక ఆయ‌న్నే బాబు ఇన్‌చార్జ్‌గా పెట్టారు. 2014లో వైసీపీ నుంచి ఓడిన బాలాజీ మూడో ప్లేస్‌లో నిలిచారు.

ఇక చిరంజీవి ప‌ద్మ‌సాలీ వ‌ర్గం ఓట్లు ఉన్నాయ‌ని మంగ‌ళ‌గిరి నుంచి ఎన్నో ఆశ‌ల‌తో చీరాల వ‌స్తున్నారు. అయితే 2014లో టీడీపీ వేసిన ఈ అస్త్రం కూడా ప్లాప్ అయ్యింది. ఆ ఎన్నిక‌ల్లో ప‌ద్మశాలీ వ‌ర్గానికే చెందిన పోతుల సునీత పోటీ చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఆమంచి కృష్ణ‌మోహ‌న్ చేతిలో ఏకంగా 10 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. మ‌ళ్లీ ఇప్పుడు లోకేష్ కోసం గంజి చిరంజీవి బ‌లికాక త‌ప్ప‌దేమో ?