గాంధీలో పేషెంట్ డెడ్‌.. తీవ్ర ఉద్రిక్త‌త‌

హైద‌రాబాద్‌లో క‌రోనా పేషెంట్ల‌కు చికిత్స అందించ‌డంలో కీలకంగా వ్య‌వ‌హ‌రిస్తున్న గాంధీ ఆసుప‌త్రిలో మ‌రోసారి ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఇక్క‌డ గ‌తంలో క‌రోనా పేషెంట్ తాలూకు బంధువులు ఓ వైద్యుడిపై దాడి చేయ‌డం.. వైద్యులంతా నిర‌స‌న‌కు దిగ‌డం.. ఉద్రిక్త‌త నెల‌కొన‌డం తెలిసిందే. ఆ నేప‌థ్యంలోనే వారికి క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాట్లు చేశారు. అలాగే వైద్యుల‌పై దాడి చేసే వారి ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌డం మొద‌లుపెట్టారు. అయినా స‌రే.. తాజాగా ఓ పేషెంట్ తాలూకు వ్య‌క్తి మ‌ళ్లీ ఓ వైద్యుడిపై దాడి చేశాడు. 55 ఏళ్ల క‌రోనా పేషెంట్ సోమ‌వారం గాంధీలో ప్రాణాలు కోల్పోగా.. అత‌డి అటెండెంట్ ఆగ్ర‌హం ప‌ట్ట‌లేక ఓ జూనియ‌ర్ డాక్ట‌ర్ మీద దాడి చేసిన‌ట్లు తెలుస్తోంది.

సద‌రు పేషెంట్‌కు ఇప్ప‌టికే తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లుండ‌గా.. క‌రోనా ఎటాక్ అయి ప‌రిస్థితి విష‌మించింది. అత‌నున్న ప‌రిస్థితుల్లో బెడ్ దిగి టాయిలెట్‌కు వెళ్లొద్ద‌ని వైద్యులు సూచించార‌ట‌. కానీ అత‌ను వైద్యులు లేని స‌మ‌యంలో టాయిలెట్‌కు వెళ్లి అక్క‌డే కుప్ప‌కూలి చ‌నిపోయిన‌ట్లుగా వార్త‌లొస్తున్నాయి. ఐతే పేషెంట్ మృతి గురించి తెలిసిన అటెండెంట్.. ఆవేశంగా వెళ్లి ప్లాస్టిక్ స్టూల్ తీసి వైద్యుడిపై విసిరాడ‌ట‌. అంత‌టితో ఆగ‌కుండా ఐరెన్ స్టూల్ తీసి చేతిపై కొట్టాడ‌ట‌. దీంతో వైద్యుడికి గాయాల‌య్యాయి. విష‌యం తెలిసిన గాంధీ వైద్యులంద‌రూ విధుల్ని బ‌హిష్క‌రించి ఆసుప‌త్రి ప్రాంగణంలో నిర‌స‌న‌కు దిగారు. డ్యూటీలో లేని డాక్ట‌ర్లు కూడా విష‌యం తెలిసి అక్క‌డికొచ్చి ఆందోళ‌న‌లో నెల‌కొన్నారు. దీంతో గాంధీ ఆసుప‌త్రిలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.