వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంలో ఏటా అత్యంత ఆడంబరంగా నిర్వహించుకుం టున్న కార్యక్రమం జగన్ పుట్టిన రోజు వేడుక. ముఖ్యంగా జగన్ సీఎం అయిన తర్వాత.. ఈ వేడుకలకు మరింత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయన ఇద్దరు కుమార్తెలు ఎక్కడ ఉన్నా.. ఆ రోజు మాత్రం తండ్రి సమక్షంలో ఉండాల్సిందే. ఇక, గత ఏడాది తల్లి విజయమ్మ కూడా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు.
ఇక, ఇప్పుడు ఏడాది పుట్టిన రోజుకు అత్యంత విశేషం ఉంది. అదేంటంటే.. ఈ పుట్టిన రోజుతో జగన్ 50 ఏళ్ల వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ క్రమంలో ఈ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని.. పార్టీలో నాయకులు రెడీ అయ్యారు. మరీ ముఖ్యంగా మంత్రులు కావాలని..ఆశలు పడుతున్న వారు.. ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
దీంతో జగన్ పుట్టిన రోజు వేడుకలను అంగరంగ వైభవంగా చేసి.. ఆయన దృష్టిలో పడేందుకు.. కోటి రూపాయలకు తక్కువ కాకుండా.. పెద్ద పెద్ద గిఫ్టులను జగన్‌కు ఇవ్వనున్నారని.. ఒకరిద్దరి నుంచి సమాచారం. ముఖ్యంగా తాము ఇచ్చిన గిఫ్టుతో జగన్ ఫిదా అయిపోయి.. తమకు మంత్రి పదవిని రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారట. ఈ జాబితాలో గుంటూరుకు చెందిన ఓ మహిళా నాయకురాలు.. అదేవిధంగా అనంతపురం జిల్లాకు చెందిన మరో మహిళా ఎమ్మెల్యే, విశాఖకు చెందిన యువ నాయకుడు, తూర్పుకు చెందిన.. మరో కాపు నాయకుడు.. ముందు వరుసలో ఉన్నారని అంటున్నారు.
అంటే.. వీరంతా కూడా మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నవారే. వీరికి జగన్ కరుణిస్తారా? లేదా? అనే సంశయం అయితే ఉంది. ఈ క్రమంలో ఆయనను ఆకట్టుకునేందుకు వారు భారీ గిఫ్టులతో తాడేపల్లికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారట. దీని వెనుక.. జగన్ ఇచ్చే రిటర్న్ గిఫ్టుగా మంత్రి పదవిని పొందాలని.. వారు ఆశిస్తున్నట్టు సదరు నేతల అనుచరులు చెబుతున్నారు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.