బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవిఎల్ నరసింహారావు పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయాలని అనుకుంటున్నారా ? అందుకు నియోజకవర్గాన్ని కూడా ఎంపిక చేసుకున్నారా ? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న జీవీఎల్ నరసింహారావు సొంత జిల్లా ప్రకాశం. జీవీఎల్ రాజ్యసభ ఎంపీ అయ్యేంతవరకు చాలామందికి అసలాయన ఏపీ వ్యక్తే అన్న విషయం కూడా తెలీదు.
ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారట. తర్వాత కొంతకాలం బాపట్లలో కూడా చదివారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళిపోయి అక్కడే సెటలయ్యారు. తనకున్న పరిచయాలతో జీవీఎల్ బీజేపీలో చొచ్చుకుపోయి నరేంద్రమోడీ దృష్టిలో పడటంతో మొత్తానికి రాజ్యసభ ఎంపీ అయిపోయారు. అయితే రాజ్యసభ ఎంపీగా కన్నా లోక్ సభ ఎంపీగా గెలవాలనే కోరిక బలంగా ఉందంటున్నారు.
అందుకని వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంటుకు పోటీచేయాలని అనుకున్నారట. ఇందులో భాగంగానే తరచూ నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పర్యటనలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పార్టీ పొత్తులపైనే జీవీఎల్ ఆశలు పెట్టుకున్నారట. జనసేనతో ఇప్పటికే పొత్తున్నప్పటికీ అది సరిపోదని టీడీపీతో కూడా పొత్తు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉందనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఏదో పార్టీతో పొత్తు లేకుండా చంద్రబాబు నాయుడు ఎన్నికలను ఫేస్ చేసింది ఒక్కసారే.
ఈసారి జనసేన+బీజేపీ+ తెలుగుదేశం పొత్తుల పట్ల ఆసక్తిగానే ఉన్నట్టున్నాయి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పై మూడు పార్టీల మధ్య పొత్తుంటుందనే ప్రచారమైతే పెరిగిపోతోంది. కాబట్టే జీవీఎల్ ముందుజాగ్రత్తగా నరసరావుపేట లోక్ సభ లో పోటీ విషయమై రెడీ చేసుకుంటున్నారట. అందుకే ఈ నియోజకవర్గంలో తరచూ పర్యటనలు చేయటం, స్థానిక నేతలు, ప్రజలతో గట్టి సంబంధాలను కోరుకుంటున్నారట.
కేంద్రం నిధులతో జరుగుతున్న కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను మధ్య మధ్యలో వచ్చి పర్యవేక్షిస్తున్నారట. ఇదంతా రేపటి ఎన్నికల్లో పోటీచేయటానికే అనే ప్రచారం పార్టీలో బలంగా జరుగుతోంది. అంతా బాగానే ఉంది కానీ అసలు జీవీఎల్ కు కానీ లేకపోతే పార్టీకి గానీ క్షేత్రస్ధాయిలో ఉన్న పట్టెంత అన్నదే ఇక్కడ కీలకం. ఒకవేళ టీడీపీతో పొత్తుంటే అప్పుడు జనసేన+టీడీపీ తరపున వచ్చే ఓట్లపైనే జీవీఎల్ ఆశలు పెట్టుకున్నారు. అంటే జీవీఎల్ పోటీ అనేది పొత్తుపై ఆధారపడుందనేది స్పష్టం. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates